Mobile Popup Ad
Mobile Popup Ad

“రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్” యాప్‌ను ప్రారంభించిన పువ్వాడ!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఖమ్మం (Khammam ) నగరంలోని ఐఎంఏ హాల్ నందు నిరుద్యోగ యువత కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన “రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్” మొబైల్ యాప్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కలిసి ఘనంగా ప్రారంభించారు. అధికారంలో లేకపోయినా నిరుద్యోగ యువతకు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో రాకేష్ రెడ్డి ఈ యాప్‌ను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా వారు అభినందించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన కనీస బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుందని వారు స్పష్టం చేశారు. ​

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా, ఉద్యోగాల ఊసే లేకుండా “మెస్సి”లను పట్టుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తాము 1.60 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, 2022-2023 నాటికే 40 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశామని గుర్తుచేశారు. అయితే ఆ సమయంలో కేవలం ఎన్నికల నోటిఫికేషన్ (కోడ్) రావడం వల్లే నియామక పత్రాలు ఇవ్వలేకపోయామని, వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తామే ఇచ్చినట్టుగా చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. సాధారణంగా ఏ ఉద్యోగం ఖాళీ అయినా వాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి భర్తీ చేయాల్సి ఉంటుందని, కానీ ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.

​గతంలో తాము చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులు చదువుకోవడం కోసం కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి దానికి తాము అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు. అలాగే లైబ్రరీలో చదువుకునే విద్యార్థులు మధ్యాహ్నం తినడానికి ఇబ్బంది పడుతున్నామని తన దృష్టికి తీసుకురాగా, వారికి కేవలం ఐదు రూపాయలకే భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశామని పువ్వాడ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీని పిలిపించి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి కింద రూ. 4వేలు ఇస్తామని, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీలు గుప్పించారని మండిపడ్డారు. వారు ఇచ్చిన స్కూటీల వల్ల ఖమ్మంలో ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అనుకున్నామని, కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ​ఎంతో వైభవంగా జరిగిన ఈ ఉచిత విద్య యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్య యాదవ్ ఇతర బీఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>