కలం, ఖమ్మం బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడుపు, పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ప్రాంతానికి పొంచి ఉన్న ముంపు ముప్పును కప్పిపుచ్చేందుకే అని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరంలో నీటిని నిల్వ చేయడం వల్లే భద్రాచలం పట్టణంతో పాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడుకున్నవని మండిపడ్డారు. భద్రాచలానికి అసలైన ముప్పు దిగువన ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్లేనని, ఈ నిజాన్ని కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా అధికారికంగా గుర్తించాయని ఆయన స్పష్టం చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నది బెడ్ లెవల్ సుమారు 26 మీటర్ల లోతులో ఉండగా, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం కారణంగా అక్కడ ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల వరకు నీటి మట్టం నిల్వ ఉంటుందని, ఇదే భద్రాచలం ప్రాంతానికి ప్రధాన శాపంగా మారిందని పువ్వాడ వివరించారు. దీనివల్ల పరిసరాల్లోని 36 గ్రామాల పరిధిలో సుమారు 184 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపు ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రజల జీవనానికి సంబంధించిన ఇంతటి జఠిలమైన సమస్యపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీస సమీక్ష జరపకుండా, కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలవరం బ్యాక్‌వాటర్ ముంపు (Polavaram Backwater Threat) సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి, భద్రాచలం ప్రాంత ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిందని పువ్వాడ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

