‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’.. కాంగ్రెస్‌పై పువ్వాడ అజయ్ ఫైర్

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, “రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదంతో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. మంగళవారం ఖమ్మం నగరం 44వ డివిజన్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ హామీలతో, ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు కానీ, అసలు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు.

అన్ని వర్గాలకు న్యాయం చేసిన పార్టీ  బీఆర్ఎస్ మాత్రమే..

​గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఎంతో కష్టపడి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తామే చేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని పువ్వాడ విమర్శించారు. ఆనాడు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపిస్తూ, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ముద్దుపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము చేసిన అభివృద్ధి పనుల వద్ద కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టుకుని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఖమ్మం నగర కీర్తి కిరీటమైన కేబుల్ బ్రిడ్జిని మంజూరు చేసి, నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆ కేబుల్ బ్రిడ్జి తీగలు పట్టుకుని వేలాడినా అది ఎవరు తెచ్చారో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసని దుయ్యబట్టారు. అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమన్యాయం చేసి మంచి చేసిన పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని కొనియాడారు.

ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు..

​రాష్ట్రంలో ‘మార్పు’ వస్తుందని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వల్ల ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పూ రాలేదని, పైగా ఉన్న కరెంట్ పోతూ, నగరం అంతా అపరిశుభ్రంగా తయారైందని పువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు కేవలం పదవులు చూసుకుని మురిసిపోవడం తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కష్టజీవులు ఎప్పుడూ తన వెంటే ఉన్నారని, 44వ డివిజన్‌లో తనతో ఉన్న పేదలను కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, వారు గుండె ధైర్యంతో బీఆర్ఎస్ వెంటే నిలిచారని ప్రశంసించారు. ఓట్లు వేసిన పేద ప్రజలను మార్కెట్ వేదికగా కాంగ్రెస్ నాయకులు ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చివేసి, ఆ భూములను కబ్జాదారులకు అప్పగించాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నితే, తాము క్షేత్రస్థాయిలో ప్రతిఘటించి పేదలకు కొండంత అండగా నిలబడ్డామని గుర్తుచేశారు.

గెలుపోటములు సహజం..

​రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, చెడు తర్వాత మంచి, చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత ఖాయమో, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అంత ఖాయమని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరూవాడా తిరిగి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మెహమూద్, మొయిన్, జానీ, సాయి, అజాస్, సోహైల్, జావీద్ తదితరులు పువ్వాడ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>