కలం, వరంగల్ బ్యూరో: వారంతా మొన్నటి వరకు బద్ధ శత్రువులు, అందరూ అధికార పార్టీ వారే అయినా ఆధిపత్యం కోసం గొడవలు పడ్డారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఘర్షణలకు దిగి రచ్చకెక్కారు. వీరి గొడవలతో పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి వరంగల్‌లో (Warangal) నానా హంగామా సృష్టించారు. అధిష్ఠానం సైతం రంగంలోకి దిగినా.. గొడవలు సద్దుమగలేదు. వీరిని సముదాయించడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఏమైందో ఏమో కానీ, ఉప్పు నిప్పుగా నేతలు సోమవారం రాత్రి ఎమ్మెల్యే నాయిని ఇంట్లో విందు భోజనం చేసి అవాక్కయ్యేలా చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ విందు రాజకీయం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది.
ఎక్కడ మొదలైందంటే..!
2024లో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కొండా సురేఖ మంత్రి పదవి చేపట్టాక 2024 అక్టోబర్‌లో దసరా పండుగ సందర్భంగా పరకాల నియోజకవర్గం ధర్మారంలో మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేకపోవడం ఘర్షణకు దారి తీసింది. దీంతో రేవూరి వర్గీయులు ఆ ఫ్లెక్సీలను చించేసి.. గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ కుర్చీలో కూర్చుని ఎవరు చెప్పారని ఇలా చేస్తున్నారు?” అని పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. హైకమాండ్ రంగంలోకి దిగాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. సురేఖతో వ్యక్తిగత విభేదాలు లేవని.. అన్నీ అధిష్ఠానమే చూసుకుంటుందని రేవూరి పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కొండా సురేఖ భర్త మురళి ఇద్దరూ ఒకప్పుడు బద్ధ శత్రువులు.
కొండా సురేఖ వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి
మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య 2025 సెప్టెంబర్‌లో పెద్ద గొడవ జరిగింది. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీలో దేవాదాయ శాఖ మంత్రిగా సురేఖ తన కోటాలో ఇద్దరు ధర్మకర్తలను నియమించారు. దీనిపై నాయిని మండిపడుతూ.. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా సభ్యులను ఎలా నియమిస్తారు? మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? అని ధ్వజమెత్తారు. దీనికిమంత్రి సురేఖ కౌంటర్ ఇస్తూ.. నాయిని అదృష్టం కొద్ది ఎమ్మెల్యేగా గెలిచారని.. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా?.. అని ప్రశ్నించారు. ఈ వివాదం కొన్నాళ్లు నడిచింది.
అధిష్ఠానం వార్నింగ్ ఇవ్వడంతోనే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల గ్రూప్ రాజకీయాలు పార్టీకి నష్టం చేస్తున్నట్లు గ్రహించిన హై కమాండ్.. రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకుని అందరూ కలిసి పనిచేయకపోతే.. టికెట్ కట్ అవుతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. దీంతో కొద్ది రోజుల కిందట జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి అందరూ ఒకే వేదిక పంచుకున్నారు. మనలో మనకు గొడవలు వద్దు. బీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యమని సురేఖ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ బాలసముద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి ఆకస్మిక విందు ఏర్పాటు చేశారు.
వారసులకు మేయర్ పీఠంపైనే అందరి కన్ను..?
నాయిని ఏర్పాటు చేసిన ఈ విందుకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, తాజామాజీ మేయర్ గుండు సుధారాణి, పాలకుర్తి కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వరద రాజేశ్వర్ రావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ తదితరులు హాజరయ్యారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నాయిని ఈ విందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. తన కూతురు లేదా అల్లుడిని మేయర్ చేయాలనే ఆలోచనలో నాయిని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా మంత్రి కొండా సురేఖ తన కూతురిని మేయర్ చేయాలని పావులు కడుపుతున్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు, మాజీ మేయర్ గుండు సుధారాణి తమ వారసుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలు మార్లు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని ఆమె భర్త మురళీని కోరినట్లు తెలిసింది.

