కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు స్వలాభం కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. వైరాలోని కట్టా నరసింహారావు స్వగృహంలో గురువారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచి సుమారు 19 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. పేదల ఇళ్లను కూల్చివేయడం తప్ప అభివృద్ధి పనులు లేవని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై ప్రజల్లో చర్చ జరుగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న 820 మందిని నిరాశ్రయులను చేసి కేవలం 310 ఇళ్లే కేటాయించడం అన్యాయమని ఆయన అన్నారు. 33% మహిళా బిల్లు ప్రవేశపెడితే జిల్లాలో 15 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని, అందులో బీఆర్ఎస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో, రాష్ట్రంలో త్వరలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. పార్లమెంటు స్థానాలు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. వాటికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా అడుగులు వేస్తుందని అన్నారు.
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) మాట్లాడే ధోరణి అభ్యంతరకరంగా ఉంది. ‘కోటి రూపాయలు ఖర్చుపెట్టి వేలకోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న మాట వాస్తవమా కాదా’ అని పొంగులేటిని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి ఆగడాలను అడ్డుకోవడానికి దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఈనెల 19న ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి కార్యకర్త హాజరుకావాలని ఆయన (Puvvada Ajay) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On: X(Twitter)

