కలం, కరీంనగర్ బ్యూరో : గోదావరి నదిలో వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఈ అంశంపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 5న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నట్లు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) తెలిపారు.కేటీఆర్ (KTR) పర్యటనకు ముందు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు దెబ్బతిన్నాయనే కారణంతో రెండేళ్లుగా ప్రభుత్వం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం లేదని విమర్శించారు.
అయితే మేడిగడ్డ బ్యారేజ్‌తో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ప్రతిరోజూ ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టులలో రెండేళ్లుగా నీరు నిల్వ చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు తీవ్ర సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పుట్ట మధూకర్ అన్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికే కేటీఆర్ ఈ పర్యటన చేపడుతున్నారని తెలిపారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

