రైతు-కూలీల హక్కులపై ప్రొఫెసర్ మహంతి కీలక వ్యాఖ్యలు

కలం, ఖమ్మం బ్యూరో: “రైతులు ప్రభుత్వాలు భావిస్తున్నట్లు కేవలం లబ్ధిదారులు కారు.. వారు స్పష్టమైన హక్కుదారులు” అని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి (Manoranjan Mohanty) స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలోని (Khammam) పీఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో ప్రారంభమైన అఖిల భారత కిసాన్ మజ్దూర్ సభ (AIKMS) 4వ జాతీయ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేశారు.

పాలకులు చెబుతున్న 7.8 శాతం వృద్ధి రేటులో శ్రమజీవులైన రైతులు, కూలీల స్థానం ఎక్కడని మహంతి ప్రశ్నించారు. దేశానికి ఆహారం అందించే శ్రామికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా అలక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట భూములు, అడవులు, గనులు, నదులను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ‘జల్, జంగల్, జమీన్’ను కాపాడుకోవాలంటే కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సమస్యలకు కేవలం విన్నపాలు చేయడం కాకుండా, అధికారంలో భాగస్వామ్యం సాధించడమే రైతు-కూలీల విముక్తికి అంతిమ పరిష్కారమని ప్రొఫెసర్ మహంతి అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి కోసం పంచాయతీ రాజ్ స్థాయి నుంచి శ్రామిక వర్గం ఐక్యమై పోరాడాలని సూచించారు. ఏఐకెయంయస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో 16 రాష్ట్రాల నుంచి వచ్చిన 450 మంది ప్రతినిధులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>