కలం, వెబ్ డెస్క్: విమానం క్రాష్ (Plane Crash) అయ్యి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మెక్సికోలో చోటు చేసుకున్నది. ఓ ప్రైవేట్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మెక్సికో(Mexico)లోని టోలుకా అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని శాన్ మాటియో అటెన్కో ప్రాంతంలో విమానం క్రాష్ అయ్యింది. అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ చిన్న ప్రైవేటు విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించారు.
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం పది మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది. విమానం టోలుకా విమానాశ్రయానికి చేరుకునేలోపు నియంత్రణ కోల్పోవడంతో సమీపంలోని సాకర్ మైదానంలో ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం విఫలమవడంతో విమానం ఒక్కసారిగా నేలపై కూలిపోయింది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సంఘటన స్థలంలోనే ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మిగిలిన వారిని తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదానికి (Plane Crash) గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందా? లేక వాతావరణ పరిస్థితులు కారణమా? అనే అంశాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Read Also: యూపీలో ఘోర ప్రమాదం.. నాలుగు బస్సులకు మంటలు
Follow Us On: Instagram


