కలం, వెబ్ డెస్క్: ఈ కాలంలో పెళ్లిళ్లకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ (Pre Wedding Shoot) చాలా కామన్ అయిపోయాయి. గుళ్లు, బీచ్‌లు, రిసార్ట్‌లు.. ఇలా చాలా చోట్ల ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతుంటాయి. ఈ షూట్స్‌లో ఒకే వీడియోలో మోడ్రన్‌గా, ట్రెడీషనల్‌గా పలు రకాలుగా వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గుళ్లలో వీడియోలు తీసుకోవడం రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ గుడిలో తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్ తీవ్ర దుమారాన్ని రేపింది. స్థానికులు ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదారు. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని సకలేశ్‌పూర్‌లో ఉన్న బెట్టద భైరవేశ్వర ఆలయంలో జరిగింది.
బెట్టద భైరవేశ్వర ఆలయంలో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటోంది. గుడి బయట ఫోటోగ్రాఫర్లు చెప్పినట్టుగా ఫోటోలు, వీడియోలకు పోజులు ఇస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కొందరు స్థానికులు ఫోటో గ్రాఫర్లతో వాగ్వాదానికి దిగారు. ఆలయంలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోటో గ్రాఫర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడ్డ ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఈ గొడవలో ఇద్దరు ఫోటోగ్రాఫర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడిలో ఒక కెమెరా కూడా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

