కలం, వెబ్ డెస్క్ : నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (Praggnanandhaa) సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, ప్రపంచ నంబర్ వన్, హోమ్ హీరో మాగ్నస్ కార్ల్‌సన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మంగళవారం జరిగిన క్లాసికల్ గేమ్‌లో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండోసారి మట్టికరిపించారు. దీంతో ఒకే టోర్నమెంట్‌లో, అదీ కార్ల్‌సన్ సొంత గడ్డపై ఆయన్ని రెండుసార్లు ఓడించిన ఏకైక భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది క్లాసికల్ చెస్‌లో వరల్డ్ నంబర్ వన్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక ప్లేయర్ కూడా మన ప్రజ్ఞానందే కావడం విశేషం.
ఈ టోర్నమెంట్‌లో కార్ల్‌సన్‌కు అస్సలు కలిసి రావడం లేదు. ఆయన ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు క్లాసికల్ ఓటములను చవిచూడగా, అందులో రెండు మన ప్రజ్ఞానంద చేతిలోనే కావడం గమనార్హం. ప్రజ్ఞానంద చేతిలో ఓటమి ఖాయమయ్యాక, కార్ల్‌సన్ తీవ్ర నిరాశతో తల ఊపుతూ, ప్రజ్ఞానందకు షేక్‌హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ ఓటమితో ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్ గెలవాలనే కార్ల్‌సన్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది.
టోర్నీలో కేవలం రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో, ఆయన టైటిల్ డిఫెన్స్ ఇప్పుడు దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. ఈ విజయంతో ప్రజ్ఞానంద 12 పాయింట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లి టైటిల్ రేసులో బలంగా నిలిచారు. మరోవైపు అమెరికాకు చెందిన వెస్లీ సో జర్మనీ ఆటగాడు విన్సెంట్ కైమర్‌ను అర్మగెడాన్ టై-బ్రేక్‌లో ఓడించి, 14 పాయింట్లతో టేబుల్ టాప్‌లో కొనసాగుతున్నారు. అలాగే ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజా ఫిరౌజ్జా, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌ను క్లాసికల్ మ్యాచ్‌లో ఓడించి 13 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. అలీరెజా చేతిలో ఓడిపోవడంతో భారత మరో స్టార్ ప్లేయర్ డి. గుకేష్ టైటిల్ రేసు నుండి అధికారికంగా తప్పుకున్నారు.
ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న గుకేష్, మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచినా గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలరు. ఈ ఏడాది చివర్లో ఉజ్బెకిస్తాన్ ఛాలెంజర్ జావోఖిర్ సిందరోవ్‌తో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న గుకేష్‌కు, ఈ టోర్నమెంట్‌లో ఇది మూడో క్లాసికల్ ఓటమి. ప్రస్తుతం ప్రజ్ఞానంద సూపర్ ఫామ్‌లో ఉండటంతో అభిమానుల్లో ఆశలు పెరిగాయి. టోర్నమెంట్‌లో ఇంకా రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉండటంతో, చివరి క్షణాల్లో టైటిల్ ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

