చైనా టేబుల్ టెన్నిస్ జట్టు కెప్టెన్‌గా వాంగ్ చుకిన్

కలం, వెబ్ డెస్క్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (Table Tennis) రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు వాంగ్ చుకిన్ (Wang Chuqin) ఇప్పుడు చైనా పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మాజీ కెప్టెన్ మా లాంగ్ (Ma Long) నుంచి ఆయన ఈ బాధ్యతలను అందుకున్నారు. ఇదే సమయంలో లీయాంగ్ జింగ్‌కున్‌ (Liang Jingkun) ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఘనమైన ట్రాక్ రికార్డ్ ఉంది. 2022 ఆసియా క్రీడల్లో వాంగ్ చుకిన్ (Wang Chuqin) ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. ఆ తర్వాత 2022, 2023, 2024 సంవత్సరాల్లో జరిగిన డబ్ల్యూటీటీ ఫైనల్స్‌లో పురుషుల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు సాధించి తన సత్తా చాటారు. 2025లో దోహాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ రెండు బంగారు పతకాలను ముద్దాడారు. ఇక ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీటీ యూనైటెడ్ స్టేట్స్ స్మాష్ ఫైనల్లో జపాన్ ఆటగాడు హరిమోటోను ఓడించి సింగిల్స్ టైటిల్ సాధించారు.

ఆ తర్వాత సెప్టెంబర్‌లో మూడోసారి డబ్ల్యూటీటీ ఛాంపియన్స్ మకావును గెలుచుకుని, తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నారు. గత నెలలో లండన్‌లో జరిగిన ఐటీటీఎఫ్ ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఇద్దరూ కలిసి చైనాకు వరుసగా 12వ సారి టైటిల్ అందించారు. ఈ టోర్నీలో వాంగ్ ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా, లీయాంగ్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో అద్భుతమైన విజయాలు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వాంగ్ మొదటి స్థానంలో ఉండగా, లీయాంగ్ 26వ స్థానంలో ఉన్నారు.

ఈ నియామకంపై చైనా పురుషుల జట్టు ప్రధాన కోచ్ వాంగ్ హావో స్పందించారు. కొత్త కెప్టెన్ వాంగ్ చుకిన్ జట్టు బాధ్యతలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పదవి కేవలం గౌరవం మాత్రమే కాదని, జట్టు పట్ల నిబద్ధతకు నిదర్శనమని కోచ్ పేర్కొన్నారు.

Read Also: ఇండోనేషియా ఓపెన్‌లో సింధు శుభారంభం..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>