Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసుల కస్టడీలో అంతర్రాష్ట్ర కింగ్‌పిన్ సుబోధ్ సింగ్!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో కీలక మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా వందల కిలోల బంగారం దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సూత్రధారి సుబోధ్ సింగ్‌ (Subodh Singh)ను కరీంనగర్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జైలు గోడల మధ్య నుంచే భారీ నెట్‌వర్క్ నడుపుతూ దొంగతనాలకు వ్యూహాలు రచించిన ఈ కింగ్‌పిన్‌ను విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. కరీంనగర్ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సుబోధ్ సింగ్‌ను విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, అతడిని నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గత మే 3వ తేదీన కరీంనగర్ జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లో ఐదుగురు నిందితులు తుపాకులతో కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ రాబరీ గ్యాంగ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, ఇప్పటికే ఇద్దరు దొంగలతో పాటు వారికి సిమ్ కార్డులు విక్రయించిన మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. బీహార్ లోని పూర్ణియా జైలులో 2018 నుండి శిక్ష అనుభవిస్తున్న సుబోధ్ సింగ్, జైలు నుంచే ఈ దోపిడీలకు స్కెచ్ వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచే గ్యాంగులను తయారు చేసి దేశవ్యాప్తంగా పంపిస్తూ, ఇప్పటివరకు 400 కిలోలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లడానికి అతడే మూలకారకుడని విచారణలో వెల్లడైంది.

ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూమ్ దోపిడీకి కూడా సుబోధ్ సింగే కీలక సూత్రధారి అయి ఉంటాడనే ప్రాథమిక ఆధారాలతో పోలీసులు బీహార్ లోని ఆరు కోర్టులలో పీటీ వారెంట్ వేశారు. బీహార్ కోర్టులు అనుమతించడంతో, మే 28న సుబోధ్ సింగ్‌ను కరీంనగర్ కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో సుబోధ్ సింగ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు, ఈ దోపిడీకి సంబంధించిన పూర్తి స్కెచ్‌ను, లూటీ చేసిన సొత్తు వివరాలను రాబట్టే పనిలో పడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>