కలం, ఖమ్మం బ్యూరో: ఇప్పటివరకు కేవలం మాట్లాడటానికే పరిమితమైన గిరిజన ప్రాంతాల ‘కోయ’ భాషకు ఐటీడీఏ భద్రాచలం (ITDA Bhadrachalam) అధికారిక గౌరవాన్ని కల్పించింది. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంతో పాటు, నేటి తరం యువతకు తమ మాతృభాషపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ అధికారిక పత్రికల్లో కోయ భాషను ప్రోత్సహిస్తూ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీఓ) బి. రాహుల్ సరికొత్త లీడ్ తీసుకున్నారు.
సాధారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ఆహ్వానాలు తెలుగు లేదా ఆంగ్లంలో మాత్రమే ఉంటాయి. కానీ, గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఈసారి ఆహ్వాన పత్రికలను కోయ భాషలో, అందరికీ అర్థమయ్యేలా తెలుగు లిపిని ఉపయోగించి రూపొందించారు. కేవలం మాట్లాడటానికే వాడే ఒక గిరిజన భాషకు, ఈ విధంగా ప్రభుత్వ ఆహ్వాన పత్రికల ద్వారా లిఖితపూర్వక రూపం ఇవ్వడం గిరిజన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

