కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా కొల్చారంలోని ‘సత్యసాయి ఆగ్రో రైస్ మిల్ ఇండస్ట్రీస్’లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మిల్లులోని ధాన్యం నిల్వలను తనిఖీ చేయగా, సుమారు 3,027 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
మార్కెట్ విలువ ప్రకారం మాయమైన ఈ ధాన్యం విలువ దాదాపు రూ. 7.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు మరియు అక్రమాలు నిర్ధారణ కావడంతో, రైస్ మిల్ యజమాని డి. శ్రీనివాస్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదోవ పట్టించి, అక్రమాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తనిఖీల్లో పాల్గొన్న అధికారులు హెచ్చరించారు.

