కలం, సినిమా: పాన్ ఇండియా హీరో ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ మూవీ (Prabhas Spirit Movie) భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఇదే టైటిల్‌తో ఓ మహిళా నిర్మాత మూవీ నిర్మించడం వివాదానికి దారితీసింది. నర్సమ్మ అనే మహిళా రైతు నిర్మాత ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేయాలనుకుంది. ఇదే విషయమై స్పిరిట్ మూవీ నిర్మాతలు మహిళ నిర్మాతకు నోటీసులు పంపడం టాలీవుడ్‌లో (Tollywood) వివాదాస్పదమవుతోంది. ఈనేపథ్యంలో మహిళా రైతు నిర్మాత నర్సమ్మ శుక్రవారం మీడియా ముందుకొచ్చి తన బాధను వ్యక్తం చేసింది.
సినిమా తీసి సర్వం కోల్పోయాం
‘‘పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు మాకు మీరే దిక్కు.. ఆస్తులు అమ్మి “స్పిరిట్” ఈజ్ నాట్ వన్ సినిమా తీసాం. పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా మాకు రెండు లీగల్ నోటీసులు పంపించి సినిమా రిలీజ్ ఆపేసారు. మాతో మాట్లాడితే వేరే టైటిల్ పెట్టుకుని మా సినిమా రిలీజ్ చేసుకునేవాళ్ళం. రిలీజ్ చెయ్యడానికి ఊరిలో ఒకరిని డబ్బులు అడిగాం అప్పుడు డబ్బులు ఇస్తాను అన్నవాళ్లు కూడా భయపడి ఇవ్వలేదు. ఊరిలో పరువు పోయింది. ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరు నమ్మడం లేదు. మా ఫ్యామిలీ రోడ్డున పడ్డాం. ప్రభాస్ గారు మమ్మల్ని మీరే ఆదుకోవాలి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
టైటిల్ మార్చుకోవడానికి సిద్ధం
‘‘మమ్మల్ని సంప్రదించకుండా టీ-సిరీస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్ రెండు లీగల్ నోటీసులు పంపారు. అడిగి ఉంటే టైటిల్ మార్పుకు ఒప్పుకునే వాళ్ళం. ఒక రైతు ఫ్యామిలీ సినిమా తీస్తే మాకు ఇండస్ట్రీ సపోర్ట్ చెయ్యడం లేదు. ప్రభాస్ గారిపై, సందీప్ రెడ్డి వంగాగారిపై అభిమానంతో విజ్ఞప్తిని చేస్తున్నా. మా “స్పిరిట్ ఈజ్ నాట్ వన్” చిత్రాన్ని విడుదల చేయకూడదని, ప్రచార కార్యక్రమాలు నిలిపివేయాలని కోరుతూ లీగల్ నోటీస్ పంపారు.’’ అని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభాస్ స్పిరిట్‌కు ముందే..
‘మా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చిత్రం 8th Wonder Cinemas బ్యానర్‌పై నిర్మించబడింది. ఈ చిత్రానికి మీరు టైటిల్ (Prabhas Spirit Movie) పెట్టకముందు మాకు సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. అంతకుముందే మేం సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. చిత్రానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చాం. గత నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించి, పోస్టర్లు ముద్రించి, విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సమయంలో సందీప్ రెడ్డి వంగా మేనేజర్ మాకు లీగల్ నోటీసు పంపించారు. ఈ పరిణామాల వల్ల మా కుటుంబం సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మీరు ఈ నోటీసు పంపడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో మాకు తెలియదు. ఒకవేళ టైటిల్‌కు సంబంధించిన ఏదైనా అభ్యంతరం ఉంటే, పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కారం కనుగొనడానికి సిద్ధంగా ఉన్నాం. మా సినిమా కోసం అనేక సంవత్సరాలుగా శ్రమించాం. ఆశలు, పెట్టుబడులు ఈ చిత్రంలో ఉన్నాయి. కాబట్టి, దయచేసి సానుకూలంగా స్పందించి, “స్పిరిట్ ఈజ్ నాట్ వన్” చిత్రాన్ని విడుదల చేసుకునే అవకాశాన్ని కల్పించాలి’’ అని నర్సమ్మ వేడుకుంది.

