కలం, చౌటుప్పల్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ (Fauzi) షూటింగ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మల్కాపురం గుట్టల్లో జరుగుతున్న షూటింగ్ కోసం వెళ్తున్న క్యాటరింగ్ వాహనం(AP37 AG 3999) రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి మల్కాపురం గుట్టల వైపు వెళ్తున్న క్యాటరింగ్ వాహనం (తుఫాన్), చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట సమీపంలో అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న వాహనం రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రుద్రరాజు వీర వెంకటరామరాజు (40) అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మరో ఐదుగురు డ్రైవర్ తిప్పని శ్రీకర్ తో పాటు టీమ్ సభ్యులు నాయుడు, రామకృష్ణ, రమేష్ కుమార్, శ్రీనివాసరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక సీట్లో కూర్చున్న వీర వెంకటరామరాజు తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు వారిని ప్రైవేట్ వాహనంలో అబ్దుల్లాపూర్ మెట్ లోని మనోజ్ఞ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుని తమ్ముడు గుంటూరు సాయి రవి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మల్కాపురం గుట్టల పరిసర ప్రాంతాల్లో ‘ఫౌజీ’ (Fauzi) సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే యూనిట్ సభ్యులకు భోజన వసతి కల్పించే క్యాటరింగ్ బృందం అక్కడికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సినిమా యూనిట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

