కలం, బోనకల్: భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈనెల 15వ తేదీన నల్లగొండ పట్టణంలో ఏఐకేఎస్ జాతీయ మహాసభ (AIKS National Conference) లను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్‌లోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సీపీఎం మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
ఈ మహాసభల్లో భాగంగా ఈనెల 15వ తేదీన లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బోనకల్ మండలం నుంచి 3 వేల మంది రైతులు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదివేల మంది ఈ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పాటు యువత పెద్ద ఎత్తున పోరాటంలోకి వస్తున్నారని సుదర్శన్ రావు పేర్కొన్నారు. కార్ల్ మార్క్స్ ఆనాడు చెప్పిన విధంగానే పెట్టుబడిదారీ వర్గం సమస్యలను పరిష్కరించదని నేడు రుజువైందన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన రైతాంగ పోరాటాల విజయాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ సమావేశంలో సీపీఎం నేత సామినేని రామారావు హత్య ఉదంతంపై ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రామారావు హత్యలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి మల్లు నందిని పాత్ర నేరుగా ఉందని ఖమ్మం పోలీస్ కమిషనర్ వెల్లడించిన వివరాల ద్వారా స్పష్టమైందన్నారు. హత్య చేయడమే కాకుండా బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి సంతోషపడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు సీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి కెల్లాడు సురేష్‌తో పాటు జొన్నలగడ్డ సునీత, మంద కరుణ, బంధం వెంకటరాజ్యం, తెల్లాకుల శ్రీనివాసరావు, తుళ్లూరు రమేష్, గుగులోత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

