కలం, వెబ్డెస్క్: ఏపీలో పరిషత్ ఎన్నికలకు (AP Parishad Polls) పోలింగ్ ముగిసింది. పలుచోట్ల గొడవలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి (Pulivarthi Sudha Reddy) వైసీపీ నాయకుల వెంటే ఉంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారారు. చంద్రగిరి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫేస్ టు ఫేస్ ఆమె సవాల్ విసిరారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని తెలుసుకొని సుధారెడ్డి అక్కడికి వెళ్లారు. ఇవాళంతా నేను అన్నతోనే ఉంటానంటూ అక్కడే ఆయన పక్కనే నిల్చున్నారు. అన్నకు కుర్చీ వేయండి అంటూ అక్కడున్న వారికి చెప్పారు. దీంతో కొందరు నాలుగైదు కుర్చీలు తీసుకొచ్చి పెట్టారు.
చెవిరెడ్డితో అన్నా కూర్చోండి, నేను కూడా ఇక్కడే కూర్చుంటా, టీ తాగుతూ ఎన్నికలు జరిగేలా చూద్దామన్నారు. ఎన్నికలు జరిగే చోట నాన్సెన్స్ క్రియేట్ చేసి ఒక్క వీడియో బయటకు పంపినా బాగుండదని హెచ్చరించారు. అలాంటి పనులు చేస్తే మీకూ నాకూ డైరెక్ట్ ఉద్యమం ఉంటుందని చెప్పారు. మనం ఇలాగే కూర్చుందామని, జనాలు ఓట్లు వేసుకుంటారని అన్నారు. నా భర్తను చంపాలని అనుకున్నా కూడా నేను మాట్లాడుతున్నా అని చెవిరెడ్డితో నేరుగా అన్నారు. పోలీసుల్ని, బిడ్డల్ని, నాలుగు తరాలను శాపాలు పెట్టారని మండిపడ్డారు. వీడియో తీస్తున్న వారిని పిలుస్తూ చెవిరెడ్డి దగ్గరకు వెళ్లి వీడియో తీయండంటూ నిల్చున్నారు. మీ వల్ల గలాటా జరక్కూడదు. ఒక్క నాన్సెన్స్ జరక్కూడదని చెప్పారు. సుధారెడ్డి మాట్లాడుతూనే ఉన్నా చెవిరెడ్డి మాత్రం తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఫోన్లో మాట్లాడుతూ ఆయన బిజీగా ఉన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

