అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: మంత్రి పొన్నం

కలం ,కరీంనగర్ బ్యూరో: ఆర్టీసీ (RTC) బ‌స్సుల‌కు సంబంధించి నెల‌కొన్న స‌మ‌స్య‌లు, క‌ల్పించాల్సిన స‌దుపాయాల‌పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మహా లక్ష్మీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో నియోజకవర్గాల వారీగా కావాల్సిన మౌలిక సదుపాయాలు, కొత్త బస్సులు, బస్ స్టేషన్‌ల‌ అభివృద్ధి, కొత్త రూట్లు, బస్ డిపోల అవసరాలపై మూడు రోజులుగా స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. మూడ‌వ‌ రోజు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాల్-1లో మంత్రి స‌మావేశ‌మ‌య్యారు. చెన్నూరు నియోజకవర్గంలో బస్ స్టేషన్ అభివృద్ధి తో పాటు కొత్త రూట్‌ల‌లో బస్సులు నడిపించాలని మంత్రి వివేక్ వెంకట్ స్వామి సూచించారు. సింగరేణి ఏరియాలో కార్మికులకు ఇబ్బందులు లేకుండా గతంలో నడిచిన రూట్లతో పాటు అదనపు రూట్‌ల‌లో నడిపించాలని కోరారు.

కోరుట్ల నియోజకవర్గంలో మెట్‌ప‌ల్లి, కోరుట్ల బస్ స్టేషన్‌ల‌ను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Ponnam) విజ్ఞప్తి చేశారు. మొగిలిపేట ప్రధాన రహదారి పై బస్సులు ఆగేలా చూడాలని కోరారు. మండలాల వారీగా హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఆత్మకూరుకు 8 ట్రిప్పులు నడిచేవని ఇప్పుడు 4 మాత్రమే నడుస్తున్నాయని వాటి సంఖ్య పెంచాలని కోరారు. కోరుట్ల పట్టణంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద బస్సులు ఆగాలని కోరారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ‌కు అన్ని జిల్లాల నుండి కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.

వేములవాడ‌కి సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, మెట్‌ప‌ల్లి డిపోలో నుంచి బస్సులు పెంచాలని సూచించారు. వేములవాడ, చందుర్తి బస్ స్టేషన్‌ల‌ను మోడర్న్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. కథలాపూర్ మండలం రాజారాం తండా, కథలాపూర్ కొండాపూర్ వరకు, గంభీర్ పూర్ వరకు వస్తున్న బస్సులను మోత్కూరు, గోవిందపూర్, వరకు సర్వీసులు పెంచాలని కోరారు. చందుర్తి నుండి మర్రిమడ్ల వరకు బస్సులు నడపాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam) చొరవతో వేములవాడ నుండి బాంబే కి ప్రారంభమైన బస్సుల వల్ల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రుద్రంగి, కోనరావుపేట బస్ స్టేషన్లు అభివృద్ధి చేయాలని కోరారు. మేడిపల్లి మండల కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్ లో టాయిలెట్స్ నిర్మించాలని సూచించారు.

హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో ఇప్పటికే 1.5 కోట్ల రూపాయలతో నిర్మించామని, దానికి మరిన్ని నిధులు కేటాయిస్తే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) తెలిపారు. అక్కడే ఉన్న ఆర్టీసీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు. రాచపల్లి – నాగంపేట రూట్ లో బస్సులు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కి చిరకాల స్వప్నం బస్సు డిపో మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే విజయరమణరావు ధన్యవాదాలు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా డిపో పనులు పూర్తి చేసి ప్రారంభించాలని కోరారు. పెద్దపల్లి నుండి హైదరాబాద్, హనుమకొండ కి కొత్త బస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ నియోజకవర్గంలో కొమురవెల్లి అధికముగా వెళ్తుంటారని ఓదెల నుండి కొమురవెల్లి కి ప్రత్యేక బస్సు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థ లో ఉన్న సుల్తానాబాద్ బస్ స్టేషన్ ను నిర్మించాలని కోరారు.

కరీంనగర్ – బస్ డిపో నుండి శ్రీరాంపూర్ కి బస్సులు వేయాలని కోరారు.రామగుండంలో అప్పట్లో సిటీ బస్సులు ఉండేవని ఇప్పుడు తొలగించడం వల్ల సింగరేణి లో ప్రధాన పట్టణం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని సూచించారు. గోదావరిఖని ఆర్టీసీ ఖరీదైన స్థలంలో డిపో నుండి వేలన్నీ నిర్మించి ముందు వైపు షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. రామగుండం, ఎన్టీపీసీ లలో మినీ బస్ స్టేషన్లు నిర్మించాలని కోరారు. 15 కొత్త బస్సులు కావాలని కోరారు. చొప్పదంటి ఆర్టీసీ కాంపౌండ్ వాల్ కొంత రోడ్డుకు ఇస్తే ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. కోడిమ్యాల బస్ స్టేషన్ పనులు ప్రారంభించాలని సూచించారు. విద్యార్థుల స్కూల్ సమయంలో అదనంగా బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో జగిత్యాల నుండి కడెం బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్‌కు బస్సులు పెంచాలన్నారు. ఉట్నూరు-ఆదిలాబాద్ మధ్య బస్సులు నడిపించాలని, ఉట్నూరు ఆర్టీసీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు. నిజాం కాలంలో నిర్మించిన ఆసిఫాబాద్ పురాతన బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ విజ్ఞప్తి చేశారు. బస్ స్టేషన్‌లో ఫ్లాట్ ఫాం సంఖ్య పెంచాలని కోరారు. 5 పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు నడపాలని కోరారు. నియోజకవర్గం నుండి వేములవాడ, కొండగట్టుకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. ఆర్టీసీ పెట్రోల్ బంకు ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు. బస్ స్టేషన్ లో టాయిలెట్స్ నిర్మించాలని కోరారు. బోథ్ లో చాలా రూట్ లలో బస్సులు బంద్ అయ్యాయని కొత్త రూట్ లలో బస్సులు నడిపించాలని కోరారు.

ఇచ్చోడ బస్ స్టేషన్ 18 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని దానిని అభివృద్ధి చేయాలని కోరారు. సిరికొండ, తలైగూడ, కరంజీ, నిగ్నె, వధురు, కుంతల మీదుగా బస్సులు నడపాలని సూచించారు. 2027 జూన్ లో పుష్కరాలు సమీపిస్తుండటంతో బాసర లో బస్ స్టేషన్ ఆధునీకరించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ (Ramarao Patel) విజ్ఞప్తి చేశారు. ఫ్లాట్ ఫామ్ పెంచాలని, టాయిలెట్స్ నిర్మించాలని కోరారు. ఉబెర్ బస్ స్టేషన్ లో సీసీ వేయాలని కోరారు. భైంసా నుండి పోహ్రాద్ బస్సులు నడపాలన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలని రోడ్లతో సంబంధం లేకుండా మారుమూల ప్రాంతాల్లో బస్సులు నడపాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ విజ్ఞప్తి చేశారు

అశ్వారావుపేటలో కవడిగుండ్ల, గుమ్మడవల్లి కి దశాబ్ద కాలం తర్వాత బస్సులు రావడంపట్ల ఎమ్మెల్యే ఆది నారాయణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దమ్మపేట బస్ స్టేషన్ శిథిలావస్థ లో ఉండడంతో దానిని 60 లక్షలు మంజూరయ్యాయనీ త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. భద్రాచలం వెళ్లడానికి విజయవాడ కొత్తగూడెం నుండి కాకుండా ఆల్టర్నేటివ్ రూట్ లో బస్సులు నడపాలని సూచించారు. పినపాక నియోజకవర్గంలో గుండారం మండలంలో రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమని అక్కడ మధ్యాహ్నం సమయంలో అదనంగా బస్సులు నడపాలని కోరారు. మణుగూరు సింగరేణి ప్రాంతంలో లక్ష జనాభా ఉందని అక్కడ బస్ డిపో కి అదనంగా బస్సులు కావాలని కోరారు. నియోజకవర్గం లో అదనంగా బస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో అదనంగా బస్సులు నడపాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య (Koram Kanakaiah) కోరారు. వైరా నియోజకవర్గం నాలుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉందని అదనంగా బస్సులు వేయాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు.

మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతులు స్వీకరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. అన్ని జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బస్ స్టేషన్ అభివృద్ధిలో ఆర్టీసీ తో ఎమ్మెల్యేలు తమ ఫండ్స్ ద్వారా సహకరించాలని కోరారు. కొత్తగా వస్తున్న బస్సులు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నా అక్కడకి పంపిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రూటులో బస్సులు పంపించడానికి యాక్షన్ ప్రాన్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులతో ఆర్టీసీ అధికారులు సంబంధాలు కలిగి ఉండాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తే ఆ చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో కరీంనగర్ ఆదిలాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డి, మేడిపల్లి సత్యం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ రావు, వెడ్మా బొజ్జు, కోవా లక్ష్మీ, అనిల్ జాదవ్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, జారే ఆది నారాయణ, కోరం కనకయ్య, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఆర్ఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ స్టాండ్ ఇదే..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>