అంపైర్‌గా సెంచరీ.. రిఫెల్ ఘనత!

కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాల్ రిఫెల్ (Paul Reiffel) అంపైర్‌గా మరో అరుదైన ఘనత సాధించాడు. అంపైర్‌గా 100 పురుషుల వన్డేలు పూర్తి చేశాడు. భారత్‌-న్యూజిలాండ్ మధ్య హామిల్టన్‌లో జరిగిన మూడో వన్డేలో విధులు నిర్వహించడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 23వ అంపైర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా నుంచి ఈ రికార్డు అందుకున్న ఆరో అంపైర్‌గా గుర్తింపు పొందాడు. ఐసీసీ నవంబర్ 11న ఆయనను అభినందించింది. 60 ఏళ్ల రిఫెల్ గతంలో ఆస్ట్రేలియా తరఫున ఫాస్ట్ బౌలర్‌గా ఆడాడు. 2005లో ఆస్ట్రేలియా జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నాడు. 2008లో ఐసీసీ అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చేరిన తొలి మాజీ ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. 2013లో ఎలైట్ ప్యానెల్‌కు ప్రమోట్ అయ్యాడు.

అనేక రికార్డులు..

2009 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో పాల్ రిఫెల్ వన్డే అంపైరింగ్ ప్రారంభించాడు. ఇప్పటివరకు 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2017, 2025 ఛాంపియన్స్ ట్రోఫీల్లోనూ అంపైరింగ్ చేశాడు. మరో అరుదైన విషయం ఏమిటంటే.. శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, రిఫెల్ మాత్రమే ఆటగాళ్లుగా 90 వన్డేలు ఆడటంతో పాటు అంపైర్లుగానూ 90 వన్డేల్లో విధులు నిర్వహించారు. తన ప్రయాణంలో ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా సహకారం మరువలేనిదని రిఫెల్ తెలిపాడు. కుటుంబ సభ్యులు, సహచరుల మద్దతుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆటగాడిగా, అంపైర్‌గా అత్యున్నత స్థాయిలో క్రికెట్‌లో భాగం కావడం తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>