కలం, తెలంగాణ బ్యూరో : కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీపై (Kavitha New Party) బీఆర్ఎస్ నేతలు సైలెంట్‌గానే ఉన్నారు. ఆమె పార్టీ గురించి మాట్లాడడానికి కూడా సిద్ధపడడంలేదు. ఆమె పార్టీ పెట్టినా బీఆర్ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదన్నదే వారి ధోరణి. డోన్ట్ కేర్ అనే మాటలు గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నది వారి భావన. బీఆర్ఎస్ (BRS) పైనా, ఆ పార్టీ నేతలపైనా గతంలో కవిత విమర్శలు చేసినప్పుడు కూడా రియాక్ట్ కాకుండా సంయమనంతోనే ఉన్నారు. ఇప్పుడు కొత్త పార్టీ ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన వ్యవహారంపైనా పట్టీపట్టనట్లుగానే ఉన్నారు. ఆమె పెట్టే పార్టీ అసలు పోటీయే కాదన్నది వారి భావన. అందుకే ఆమె పార్టీ గురించి ప్రకటన చేసినా, ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించినా కామెంట్ చేయడానికి ఆసక్తి చూపడంలేదు.
జాతీయ పార్టీలతోనే బీఆర్ఎస్‌కు పోటీ :
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ అని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. రెండేళ్లలో ఆ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతూ ఉన్నదని, అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనంటూ ఓపెన్‌గానే చెప్తున్నారు. “రెండు జాతీయ పార్టీలతోనే కొట్లాడుతున్నాం. కొత్తగా పెట్టబోయే పార్టీతో అయ్యేదేముంది?.. పొయ్యేదేముంది?.. మా పార్టీ లీడర్లు, కేడర్ ఎవ్వరూ కవిత పార్టీలోకి వెళ్లరు. ఆమె పార్టీవైపు చూసేదెవరనేది కవితకు సంబంధించిన వ్యవహారం. మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు ఆ పార్టీని పట్టించుకోవడమే లేదు..” అని ఓ గులాబీ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణలో రెండేండ్ల క్రితం ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది… కండ్ల ముందే అది కనుమరుగైపోయింది.. అని గుర్తుచేశారు.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ స్ట్రాంగ్ :
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతిన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికీ స్ట్రాంగ్‌గానే ఉన్నామన్నది బీఆర్ఎస్ (BRS) లీడర్ల ధీమా. కవిత కొత్త పార్టీ పెట్టినా అందులోకి బీఆర్ఎస్ నుంచి ఎవ్వరూ వెళ్లరనేది వీరి నమ్మకం. ఆ పార్టీకి సరైన నినాదం, విధానమే లేదని, బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత పార్టీని, లీడర్లను తిట్టడం మినహా ప్రజాందోళనలు చేసిన ఆచరణే లేదని పలువురు కామెంట్ చేశారు. ఇప్పటివరకు ఆమె పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న లీడర్ ఒక్కరైనా చేరారా అని గుర్తుచేసిన ఓ గులాబీ నేత.. రానున్న రోజుల్లో అలాంటివారు చేరుతారన్న సంకేతాలే లేవన్నారు. కవిత పెట్టే పార్టీతో బీఆర్ఎస్‌కు ఎలాంటి నష్టమూ ఉండదని, ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు. జాతీయ పార్టీలతోనే కొట్లాడుతుంటే కొత్తగా వచ్చే పార్టీకి ఎందుకు భయపడతామంటూ షర్మిల పార్టీ గురించి గుర్తుచేశారు.
Read Also: BRS బడా నేతలకు బిగ్ షాకిచ్చిన CM రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

