కలం, కరీంనగర్ బ్యూరో: దేశంలో అక్రమ ఓటర్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన ప్రత్యేక సమగ్ర సవరణ-ఎస్ఐఆర్ (SIR)పై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బూత్ లెవెల్ ఏజెంట్ (BLAs)లకు వారి బూత్ లో అర్హత ఉన్న ఒక ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు, బీఎల్ఏ-2లు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఎల్ఏ-2లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, అదే ఉత్సాహంతో తదుపరి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ప్రతి బూత్‌లో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చిరునామా మార్పు, పేరు సవరణ, ఫోటో మార్పు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాలను ధృవీకరించాలని చెప్పారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నుండి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసే ప్రతి డ్రాఫ్ట్ జాబితాను పరిశీలించి అవసరమైన అభ్యంతరాలు, సవరణలు సకాలంలో సమర్పించాలని చెప్పారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం మనందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి SIR ప్రక్రియను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని కేడర్ కు పిలుపునిచ్చారు.

