కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన సొంత ఊరిపై ఉన్న ప్రేమను, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తన తండ్రి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేటకు ఆయన సతీమణి రష్మిక మందన్నతో కలిసి బయలుదేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్మికతో కలిసి ప్రకటించిన ‘చిన్ననాటి కల’ను నిజం చేస్తూ విజయ్ దేవరకొండ తాజాగా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
దేవరకొండ ఫౌండేషన్ (The Deverakonda Foundation) ద్వారా అచ్చంపేట మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతూ, చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కష్టపడి చదివి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన ఆ 180 మంది విద్యార్థుల పూర్తి జాబితాను హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, తన సొంతూరితో తనకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఊరికి చేయాల్సింది ఇంకా చాలా ఉందంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు. కేవలం సినిమాలే కాదు, సమాజ సేవలోనూ తాము ఎప్పుడూ ముందుంటామని టాలీవుడ్ స్టార్ కపుల్ ‘విరోష్’ (విజయ్, రష్మిక) మరోసారి నిరూపించారు. దేవరకొండ ఫౌండేషన్ చేస్తున్న ఈ సేవపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

