కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) (Peddi Sudarshan Reddy) హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఒంటి గంట తర్వాత పెద్ది చనిపోయినట్లు యశోద డాక్టర్లు ధృవీకరించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూ చెప్పిన వైద్యులు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వివాహం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు.
నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2019-23 వరకు సేవలందించారు. తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గానూ పనిచేశారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఐదు రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. తొమ్మిదిసార్లు సీపీఆర్ చేసి ఆయనను కాపాడిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి షిప్ట్ చేశారు. కేసీఆర్, హరీశ్ రావు సహా పలువురు ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించినా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

