కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ నిత్యం విషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. తేజస్వి సూర్య వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం అనేక సంప్రదింపులు, ప్రజల దీర్ఘకాల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోట్లాది ప్రజల ఆకాంక్షల ప్రతిఫలమన్నారు.
మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా బీజేపీ ఎంపీ పార్లమెంట్‌లో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బ్రిటిష్ ఇండియా విభజన కంటే ఆంధ్రా-తెలంగాణ విభజన దారుణమని చెప్పడం పూర్తిగా అసత్యమని, చరిత్రను వక్రీకరించడమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అంశంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. అలాంటి కీలక విషయంపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్నప్పుడు, అనవసరంగా తెలంగాణపై వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు.
బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు నోరు విప్పరా?
తేజస్వి సూర్య (Tejasvi Surya) వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వారే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజాకవి గద్దర్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్‌ను అవమానించేలా మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రమంటే బీజేపీకి మొదటి నుంచి వివక్ష ఉందని పొన్నం (Ponnam Prabhakar) పేర్కొన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ విభజనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను పార్టీలకతీతంగా తెలంగాణ వాదులంతా ఖండించాలని డిమాండ్ చేశారు.
Read Also: ‘హౌ డేర్ యు’.. తేజస్వీ సూర్యపై కవిత ఫైర్
Follow Us On: X(Twitter)

