కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి డిపోలో 60 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రజలకు పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. పొల్యూషన్ తగ్గించేందుకు 2027 నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 960 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, అందులో హైదరాబాద్ నగరంలోనే 545 ఈవీ బస్సులు సేవలందిస్తున్నాయని తెలిపారు. ఇంటర్‌సిటీ సేవల కింద 580 బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
మరో ఢిల్లీలా మారకుండా ఉండేందుకే..
మరో ఢిల్లీలా కాలుష్య నగరంగా హైదరాబాద్ మారకుండా ఉండేందుకే ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి (Ponnam Prabhakar) వివరించారు. మొత్తం 3,000 ఎలక్ట్రిక్ బస్సులను అమలు చేస్తే 600 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఆర్టీసీలో ప్రస్తుతం 10 వేల బస్సులు ఉండగా, అందులో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో పలు సంస్కరణలు చేపట్టామని తెలిపారు. కొత్త నియామకాలు, కొత్త బస్సుల ప్రవేశంతో ఆర్టీసీ దేశంలోనే ఉత్తమ సంస్థగా నిలుస్తోందన్నారు.
ఇప్పటివరకు రూ.310 కోట్ల ఉచిత టికెట్లు..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు రూ.310 కోట్ల ఉచిత టికెట్లను వినియోగించుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు మహిళలను బస్సుల యజమానులుగా కూడా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కేపీహెచ్‌బీలో కొత్త డిపో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కూకట్‌పల్లి డిపో విస్తరణలో భాగంగా 5 ఎకరాల స్థలంలో కొత్త డిపో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులు హౌసింగ్ బోర్డు అధికారులకు లేఖ రాయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి తదితరులు హాజరయ్యారు.
Read Also: మైహోమ్ సంస్థకు హైడ్రా షాక్ : 1800 కోట్ల కబ్జా భూమి స్వాధీనం!
Follow Us On: X(Twitter)

