కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని మాదాపూర్‌లో (Madhapur) కోట్ల రూపాయల విలువైన చెరువు భూమిని మాయం చేయాలనే కబ్జాదారుల ప్రయత్నాలకు హైడ్రా (HYDRA) బ్రేక్ వేసింది. మైహోమ్ రామేశ్వర రావు సంస్థ ఆక్రమించిన చెరువు శిఖం భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ సర్వే నంబరు 7లో ఉన్న 6.05 ఎకరాల ఈదులకుంటను కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది. శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట నిండితే వరద కాలువ ద్వారా ఈదుల కుంటకు నీరు చేరేది. ఆ కాలువను డైవర్ట్ చేయడం ద్వారా ఈదుల కుంటకు వరద నీరు చేరకుండా చేశారు. చెరువు రూపురేఖలు మార్చేసి, హద్దులు చెరిపేసి ఇక భవన నిర్మాణాలే ఆలస్యం అనుకున్న తరుణంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. తమ్మిడికుంట, ఈదులకుంట, సున్నం చెరువులుగా గొలుసుకట్టుగా ఉన్న వాటిలో ఈదుల కుంట మాయమౌతోందని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా కేసు నమోదయ్యింది.
స్థానికుల ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా (HYDRA)కు అక్కడ చెరువు ఆనవాళ్లు కనిపించాయి. గ్రామ, రెవెన్యూ రికార్డుల మేరకు 6.05 ఎకరాల చెరువున్నట్టు అధికారులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాలు సైతం స్పష్టం చేశాయి. దీంతో మంగళవారం చెరువు హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేశారు. 6.05 ఎకరాల ఈదులకుంటతో పాటు ఆ పక్కనే సర్వే నంబరు 11/37లో ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. మొత్తం 11.21 ఎకరాల భూమిని కబ్జాదారుల నుండి విడిపించారు. ఇలా ఒక్క మాదాపూర్‌లోనే దాదాపు రూ. 1800 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగళవారం కాపాడి, ఆ భూమి చుట్టూ హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేస్తోంది.
Read Also: గుజరాత్‌లో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
Follow Us On : WhatsApp

