కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని డీర్ పార్క్‌లో పొన్నం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ క్షితిజ, అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, డీఎఫ్‌వో సత్యనారాయణ, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గత ఏడాది సిద్ధిపేట జిల్లాలో అటెండర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు దాదాపు 11 వేల మంది ఒకేసారి మొక్కలు నాటారని గుర్తు చేశారు. కరీంనగర్‌లో కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు స్టీల్ వస్తువుల కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దాదాపు 70 వేల స్టీల్ ప్లేట్లు, 500 హోటళ్లకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఉత్తమ మున్సిపాలిటీ అవార్డును సూర్యాపేటతో కలిసి అందుకుంటోందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్ల వద్ద కరివేపాకు, మునగ, జామ వంటి మొక్కలు నాటాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్, హౌసింగ్ ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు.
ఢిల్లీలో ఉన్నట్లుగా హైదరాబాద్ కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందని, ఇందుకోసం సుమారు రూ.1,200 కోట్ల పన్ను రాయితీలు కల్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, నీటి కొరతను నివారించేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని పేర్కొన్న మంత్రి, ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని ప్రజలను కోరారు.

