కలం, వెబ్ డెస్క్ : ప్రకృతి పరంగా, భౌగోళికంగా ఎంతో పేరుగాంచిన నికోబార్ దీవులను అదానికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. రాహుల్ గాంధీ పిలుపునకు మద్దతుగా, అండమాన్ & నికోబార్ దీవుల పరిరక్షణ కోసం సంఘీభావం తెలియజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అభివృద్ధి అవసరమే కానీ, అది పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా కాకుండా ప్రకృతిని కాపాడే దిశగా సాగాలని సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో దీవిని నాశనం చేస్తున్న పరిస్థితులను రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు.
నికోబార్ దీవుల్లో ఉన్న నావికాదళ స్థావరం విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పర్యావరణానికి సంబంధించిన వేలాది మొక్కలను, వృక్షాలను కొట్టేస్తూ ప్రకృతికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ సాగే అభివృద్ధి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, కేవలం అదానీని సంతృప్తి పరచడానికే దీవిని మొత్తం ధారదత్తం చేసి దాన్ని పాడుచేసే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాహుల్ గాంధీ స్ఫూర్తికి, ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ సామాజికంగా తమ మద్దతుగా నిలవాలి మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

