​’హుజురాబాద్ – సుందరగిరి’ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు: పొన్నం

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ – సుందరగిరి రహదారిపై సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న హైలెవల్ బ్రిడ్జి (Huzurabad Sundaragiri Bridge) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6.60 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రోడ్లు, భవనాల శాఖ ద్వారా MDR ప్లాన్ 2026-27 కింద ఈ నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు (G.O.Rt.No.474, తేదీ: 07-09-2026) జారీ అయ్యాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. ​హుజురాబాద్ – సుందరగిరి మార్గంలోని కిలోమీటర్ 10/0-2 వద్ద 10 మీటర్ల వెడల్పుతో 6 వెర్టికల్ (6V) హైలెవల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు హుజురాబాద్ చేరుకోవడానికి ఈ బ్రిడ్జి ఎంతో కీలకం కానుంది.

​వర్షాకాలపు తిప్పలకు చెక్..

ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు, విద్యార్థులు, ఉద్యోగుల ప్రయాణాలకు మార్గం సుగమమవుతుంది. పరిసర గ్రామాల మధ్య బంధం బలోపేతమై, ఆర్థిక లావాదేవీలు వేగవంతమవుతాయి. ​వంతెన మంజూరు పట్ల హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గ పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

దశాబ్దాల కలను నెరవేర్చినందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం పునరుద్ఘాటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>