ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు.. అభివృద్ధే ల‌క్ష్యం: పొన్నం ప్ర‌భాక‌ర్

క‌లం, కరీంనగర్ బ్యూరో: ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు చేశామ‌ని, త‌ర్వాత అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. హుజురాబాద్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ సమావేశం సంద‌ర్భంగా మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. అంద‌రి ఆశీర్వాదంతో హుజురాబాద్‌లో అధికార పార్టీకి చెందిన పాలకవర్గం ఎన్నికైంద‌న్నారు. హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అభివృద్ధిని ఆకాంక్షించి ప్ర‌జ‌లు అధికార‌ పార్టీకి అవకాశం కల్పించార‌ని మంత్రి చెప్పారు. హుజురాబాద్ చైర్మన్ రూ.300 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చార‌ని మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ లైన్‌లు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

జిల్లా ఎమ్మెల్యేల స‌హ‌కారంతో హుజురాబాద్‌ను (Huzurabad) అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ‌ని పొన్నం వెల్ల‌డించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు హుజురాబాద్, జమ్మికుంటకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన‌ట్లు తెలిపారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. పరిసరాల పరిశుభ్రత, నో డ్రగ్స్, సురక్షిత భద్రత, పెండింగ్ ఫైల్ క్లియరెన్స్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింద‌న్నారు. మహిళా సంఘాల సభ్యుల ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల పరిశుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. ఫైల్స్ క్లియరెన్స్ అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు. ఈ వ్యర్థాల సేకరణ చేసి పాడైపోయిన‌ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ లాంటివి రీసైక్లింగ్‌కి ఇవ్వాల‌న్నారు.

రానున్న‌ వర్షాకాలంలో అందరూ మొక్కలు నాటాల‌ని మంత్రి సూచించారు. దేశ రాజధానిలో జీవించే పరిస్థితి లేద‌ని, అక్కడి పరిస్థితి మ‌న‌దాకా రావొద్ద‌ని కోరారు. ప్ర‌జ‌లంతా ఏక‌మై ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. అంద‌రూ స్టీల్ వస్తువుల‌నే వాడాల‌ని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజల సహకారం కావాల‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాల‌ని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) సూచించారు. పోలీస్, ర‌వాణా శాఖ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న‌ అరైవ్ అలైవ్ నుంచి స్ఫూర్తి పొంది రోడ్డు ప్రమాదాలను తగ్గించాల‌ని కోరారు.

రాష్ట్రంలో పిల్లల భద్రత ఎంతో ముఖ్యమైంద‌ని మంత్రి గుర్తు చేశారు. నో డ్రగ్స్ నినాదాన్ని అవ‌లంబిస్తూ గంజాయికి దూరంగా ఉండాల‌ని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాల‌ని, చ‌దువు ఎంతో ముఖ్య‌మ‌ని, ఉన్న‌త చదువులు చదివిన‌ కుటుంబాలు మాత్రమే బాగుంటాయ‌ని చెప్పారు. పిల్లలను ఆటలు ఆడించాల‌ని, ఫిజికల్ యాక్టివిటీ పెంచాల‌ని మంత్రి కోరారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంద‌ని తెలిపారు. మహాలక్ష్మీ ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామ‌ని, రూ.300 కోట్ల జీరో టికెట్స్ ద్వారా 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తుంద‌ని చెప్పారు. మహిళలను బస్సుల యజమానులను చేశామ‌ని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లు, సోలార్ పవర్ ప్లాంట్‌లు, పెట్రోల్ బంకులు ఇలా మహిళా సంఘాలు ఎన్నో నిర్వ‌హిస్తున్నాయ‌ని చెప్పారు. ఉమ్మ‌డి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో ముందుండాల‌ని మంత్రి సూచించారు.

Read Also: గాంధీ విగ్రహం ఏర్పాటు.. సీఎం అపోహలు తొలగించాలి : తుషార్​ గాంధీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>