కలం, వెబ్ డెస్క్: ప్రజావాణికి ఫిర్యాదు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలపై అడిగి తెలుసున్నారు. ప్రజావాణిలో ముఖ్యంగా ఇల్లు లేని వారు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వచ్చిన ధరఖాస్తులను రివ్యూ చేశారు. పించన్లు, ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డుల్లో సమస్యలు భూ భారతిలో సమస్యల పరిష్కారంపై అధికారులతో మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులపై సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీలో వివిధ కారణాల వల్ల శాశ్వతంగా తొలిగిపోయిన వారు తమ ఉద్యోగాలు సర్వీసులోకి తీసుకోవడంపై త్రిమెన్ కమిటీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో మాట్లాడి ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కారంపై చర్చించినట్లు తెలిపారు. పోలీస్ కేసులకు సంబంధించిన సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
ట్యాంక్ బండ్-ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ వద్ద ఏప్రిల్ 11 వ తేదీన సీఎం రేవంత్ (CM Revanth Reddy) చేతుల మీదిగా ప్రారంభించుకునే మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి బాయి పూలే విగ్రహ నిర్మాణ పురోగతి పనులను మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha)తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి 11వ తేదీ పూలే విగ్రహావిష్కరణ ప్రారంభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల ముందే విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ , ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, మాజీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కార్పొరేషన్ చైర్మన్ లు, నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయి కుమార్, జెరిపాటి జైపాల్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, దాసు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయా దేవి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు పాల్గొన్నారు.

