కలం, రాజన్న సిరిసిల్ల: ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సోమవారం రాత్రి పరిశీలించారు. ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, వేముల వీరేశం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌లతో కలిసి సభా ప్రాంగణం, స్టేజీ, పార్కింగ్, బారికేడ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రేపటి సాయంత్రంలోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళా రుణాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతు సంక్షేమం వంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఈ సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇక్కడి నేతలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని పొన్నం విమర్శించారు. ప్రభుత్వం చేనేత రంగానికి, ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

