TGSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA పెంచిన సర్కార్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC Employees) రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ (DA) పెంపుపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2026 జనవరి 1వ తేదీ నుండి వర్తిస్తుందని ఆయన తెలిపారు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకు 50.7 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 52.8 శాతానికి చేరుకుంది. ఈ పెంపు ద్వారా సంస్థపై ప్రతి నెలా 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. గత మూడు నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను రాబోయే మూడు నెలల్లో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. గతేడాది జూలైలో కూడా ప్రభుత్వం 2.1 శాతం డీఏను పెంచి 48.6 శాతం నుండి 50.7 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన డీఏతో కలిపి ప్రస్తుతం సంస్థలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలేవీ పెండింగ్‌లో లేవని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. డీఏ పెంపుతో పాటు ఆర్టీసీ ఆసుపత్రుల ఆధునీకరణ, కారుణ్య నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని మంత్రి వివరించారు.

గతంలో విధుల్లోంచి తొలగించబడిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి తీసుకోవడం, కొత్త నియామకాల ద్వారా పని భారం తగ్గించడం వంటి చర్యలు కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటుతున్నాయని ఎండీ నాగిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి జీవనాడి వంటి ఆర్టీసీని ప్రజలకు, చేరువ చేసేందుకు సిబ్బంది కృషి చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సాల్మన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>