నాడు హవా.. నేడు ఉనికి కోసం పాట్లు !

కలం, వరంగల్ బ్యూరో : నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలను శాసించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉండేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన హవా కొనసాగింది. రెండుసార్లు మంత్రిగా కీలకశాఖలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర పార్టీకి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న ఆయన (Ponnala Lakshmaiah) తర్వాత ఉమ్మడి వరంగల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి పూర్వ వైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

నాడు కొనసాగిన హవా!

పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ నేత. వరంగల్ జిల్లాలోని జనగామ శాసనసభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికై రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పీసీసీ తొలి అధ్యక్షులుగా నియమితులయ్యారు. కానీ తర్వాత ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం జనగామ నుంచి పోటీ చేసిన ఆయన అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేగాకుండా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీ కి అధికారం కట్టబెట్టడంలో విఫలం చెందారనే అపవాదును మూటగట్టుకున్నారు. దీంతో ఆయన్ను అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించింది.

టికెట్ కోసం తంటాలు

2018 సాధారణ ఎన్నికల్లో జనగామ టికెట్ కోసం పొన్నాల లక్మయ్య కష్టపడాల్సిన దుస్థితి నెలకొంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వరాష్ట్రంలో జరుగుతున్న రెండోసారి ఎన్నికల్లో అధికారం సాధించేందుకు స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జనగామ టికెట్ తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్ కు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో పొన్నాల తీవ్ర అసహనానికి గురయ్యారు. సీనియర్ నన్నే విస్మరిస్తారా అంటూ అధిష్టానంతో కొట్లాడి అతి కష్టం మీద టికెట్ సాధించారు. కానీ ఆ దఫా ఎన్నికల్లో సైతం ఓటమి చెందారు. నాటి నుంచి నియోజకవర్గానికి, ప్రజలకు దూరమయ్యారు.

బీఆర్ఎస్ లో చేరిక

2018 ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి దూరమైన పొన్నాల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో పొన్నాల ప్రమేయం లేకుండానే జనగామ జిల్లా అధ్యక్షుడి పగ్గాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి అప్పగించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన పొన్నాల 2023లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో 2024లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పొన్నాల అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ లో కొనసాగి ఉంటే పార్టీలో సీనియర్ గా గౌరవం ఉండేదని, కనీసం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయిన దక్కుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఒకానొక దశలో పై వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.

వెంటాడిన దురదృష్టం

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పొన్నాల లక్మయ్య (Ponnala Lakshmaiah) ప్రస్తుతం క్రమక్రమంగా ఉనికి కోల్పోతున్నారు. ఆయన బీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బాట పట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికొస్తే బీఆర్ఎస్ హయాంలో కీలకంగా పదవులు నిర్వహించిన నేతలు హస్తం గూటికి చేరారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కాంగ్రెస్ లో చేరిపోయారు. పొన్నాల లక్ష్మయ్య శిష్యులు సైతం ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లు గా కీలక బాధ్యతలు చేపట్టారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి బీఆర్ఎస్ లో చేరడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆయన దురదృష్టంగా భావిస్తున్నారు.

Read Also: తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతా: సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>