కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో తొలి సెంచరీ ఎవరు సాధిస్తారనే విషయంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్(Michael Clarke) సంచలన అంచనా వేశారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లోనే అయ్యర్ ఈ ఘనత సాధించవచ్చని క్లార్క్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత ఫామ్‌లో ఉంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుస విజయాలు సాధించి అజేయంగా కొనసాగుతోంది. మణికట్టు గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, గత మ్యాచ్‌లో చెన్నైపై శ్రేయస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ టాప్ ఆర్డర్ బలంగా ఉండటంతో అయ్యర్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా, వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్‌కు సెంచరీ నమోదు కాలేదు. గత సీజన్‌లో 97 పరుగుల నాటౌట్ అతని అత్యధిక స్కోరు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఆయనకు మూడు టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో అయ్యర్ ఆ సెంచరీ లోటును తీర్చుకుంటారని క్లార్క్ అంచనా వేశారు. అలాగే ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీస్తారని కూడా ఆయన (Michael Clarke) జోస్యం చెప్పారు. గత నాలుగు మ్యాచ్‌ల్లో పంజాబ్‌పై హైదరాబాద్ గెలిచిన రికార్డు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పంజాబ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: సర్కార్ వర్సెస్ ఆర్టిజన్స్.. సర్వీస్ రూల్స్ కోసం సమరం
Follow Us On: X(Twitter)

