కలం, వరంగల్ బ్యూరో: ఈ నెల 5,6,7 తేదీల్లో హనుమకొండ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మెగా రైతు మేళా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్సవాలలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మెగా రైతు మేళాను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలు, పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు ఈ ఉత్సవంలో పాల్గొని రైతులకు వివరించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ మెగా రైతు మేళాను రెవెన్యూ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా మెగా రైతు మేళాను ప్రారంభించనున్నారు.
సర్వం సిద్ధం
హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ మెగా రైతు మేళా – రైతుల ఉత్సవానికి వేదికను అధికారులు సిద్ధం చేశారు. రైతులు కూర్చునే విధంగా టెంట్లు, కుర్చీలు, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను, పరికరాలను గురించి తెలియజేసే విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు సమరం150 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. డిజిటల్ విధానం ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు. మెగా రైతు మేళాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఐఏఎస్ అధికారులు
ఆర్ట్స్ కళాశాల వేదికగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న మెగా రైతు మేళా ఏర్పాట్లను రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, హాకా మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సోమవారం పరిశీలించారు. సభా వేదిక, టెంట్లు, కుర్చీలు, స్టాల్స్, భోజన సదుపాయాలు, వీఐపీ వాహనాలు, రైతులు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలు, తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో వారు పరిశీలించారు. భద్రత వంటి అంశాలను పోలీస్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా షేక్ యాస్మిన్ భాషా, చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ రవి, ట్రాఫిక్ అదనపు డిసిపి ప్రభాకర్ రావు ఏర్పాట్లపై అక్కడే ఉండి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. మెగా రైతు మేళా ఏర్పాట్లు, నిర్వహణ లో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, సంబంధిత వర్గాలు ఈ మేళాలో పాల్గొంటున్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించడం, ఉత్తమ సాగు పద్ధతులను రైతులకు చేరవేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ మేళా ప్రధాన లక్ష్యం” అని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎండి వాజిద్ అలీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

