కలం, ఖమ్మం బ్యూరో: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar Reddy).. కర్ణాటక మాజీ మంత్రి జె. కృష్ణ పలేమార్‌ను మంగళూరులోని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పన్నెండేళ్లుగా దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న సంక్షేమ, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు చేరేలా పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయడం, కేంద్ర ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నేతలు సంకల్పించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కామత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీశ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మంజుల, సీనియర్ నాయకుడు అనిల్ రావు పాల్గొన్నారు.

