కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. కొరపోలు వంశీయుడైన కొరపోలు వెంకటేశ్వరావు రచించిన ‘కొరపోలు రామాయణం’ గ్రంథం రాసి 60 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం కొరపోలు వంశీయుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది.
ఉద్యోగ, ఉపాధి వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కొరపోలు వంశానికి చెందిన నాలుగు తరాలకు చెందిన సుమారు 150 మంది ఒకే వేదికపైకి చేరి సందడి చేశారు.
ఆత్మీయ పలకరింపులతో రోజంతా సందడి..
ఎన్నాళ్లో వేచి చూసిన ఈ తరుణంలో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ రోజంతా సందడి చేశారు. ప్రస్తుతం ఈ వంశంలో 10, 11, 12వ తరాలకు చెందిన వారసులు మాత్రమే ఉన్నారు. అందరి కంటే పెద్దవారైన 9వ తరానికి చెందిన కొరపోలు రంగనాయకమ్మ ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. నాలుగు తరాల వారసులు ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఒకే వంశానికి చెందిన వందలాది మంది ఒకే చోటకు రావడం ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ప్రాధాన్యతను చాటి చెప్పినట్లయింది. ‘కొరపోలు రామాయణం’ సాక్షిగా వంశీయులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

