భూ భార‌తికి ఏడాది… అధికారుల‌తో మంత్రి పొంగులేటి స‌మీక్ష‌

క‌లం, వెబ్ డెస్క్‌: భూ భార‌తి (Bhu Bharati) చ‌ట్టం తెలంగాణ చ‌రిత్ర‌లో కీల‌క సంస్క‌ర‌ణ‌గా నిలుస్తుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్ప‌కూలిన‌ రెవెన్యూ వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ నెల 14వ తేదీతో భూభారతి చట్టం అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో మంత్రి పొంగులేటి అధికారుల‌తో భూభార‌తి చట్టంపై సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సామాన్యుడికి భూహక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సులభంగా అందేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు.

ఇది కేవలం ఒక చట్టానికి ఏడాది పూర్తైన సందర్భం మాత్రమే కాదని, తెలంగాణలో భూహక్కుల రక్షణకు ప్రారంభమైన కొత్త శ‌కానికి నాందిప‌లికిన రోజని వ్యాఖ్యానించారు. భూ భారతి పోర్టల్ ప్రారంభించిన గ‌త ఏడాది ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్ బుక్ లు జారీ చేశామ‌ని మంత్రి వివ‌రించారు. భూభార‌తి చ‌ట్టానికి ముందు ఆ త‌ర్వాత ఉన్న‌ ప‌రిస్ధితులపై అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ చ‌ట్టం తీసుకువ‌చ్చే నాటికి ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌ల్ల తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న ప‌రిస్ధితుల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేశారు.

నాడు రాష్ట్రంలో నెల‌కొన్న‌ ప‌రిస్ధితిని పూర్తిగా మార్చాల‌న్న సంక‌ల్పంతో పార‌ద‌ర్శ‌క‌త‌, బాధ్య‌తాయుత‌, వేగం అనే మూడు ప్ర‌ధాన సూత్రాల‌తో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి (Bhu Bharati) తెలిపారు. ఈ క్ర‌మంలోనే చారిత్రాత్మ‌క‌మైన భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చామ‌న్నారు. ఈ చ‌ట్టం రాష్ట్రంలోని భూ ప‌రిపాల‌న‌ను పార‌ద‌ర్శ‌కంగా సుల‌భంగా మార్చింద‌ని వెల్ల‌డించారు. బీఆర్ఎస్‌ పాలనలో సరైన విధివిధానాలు లేకుండా తీసుకొచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది ప్రజలు తమ భూముల హక్కుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని తెలిపారు. భూమి తమదే అయినప్పటికీ హక్కులను నిరూపించుకునేందుకు అధికారుల, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేద‌ని గుర్తు చేశారు. ఆనాటి ప‌రిస్ధితుల‌ను చూసి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను బంగాళాఖాతంలో క‌లుపుతామ‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకొని గ‌తేడాది ఏప్రిల్ 14న అంబేడ్క‌ర్ జ‌యంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభార‌తి పోర్ట‌ల్‌ను ఆవిష్క‌రించుకున్నామ‌న్నారు.

తెలంగాణ రైతాంగానికి భూ భద్రత కల్పించడంలో భూభారతి ఒక బలమైన ఆయుధంగా మారింద‌ని మంత్రి వెల్ల‌డించారు. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ, సామాన్యుడికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తగ్గించడంలో ఈ ఏడాది కాలం ఒక గొప్ప ముందడుగుగా నిలిచింద‌న్నారు. ఈ 12 నెలల్లో భూభారతి పోర్టల్ పాత చిక్కుముడులను విప్పడంలో కీలక పాత్ర పోషించింద‌ని, ఈ పోర్టల్ ప్రారంభించిన ఏడాదిలోపే 5.20 కోట్లకు పైగా ప్ర‌జ‌లు ఈ పోర్ట‌ల్‌ను సంద‌ర్శించార‌ని తెలిపారు. సుమారు 67 ల‌క్ష‌ల మంది పోర్ట‌ల్‌ ద్వారా లాగిన్ అయ్యార‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల కోసం రెవెన్యూ శాఖలో గ‌ణ‌నీయ‌మైన మార్పులు తీసుకొస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా సుల‌భ‌తర‌మైన సేవ‌లు అందించ‌డానికి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐసీతో క‌లిసి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను ఈ నెల 2వ తేదీ నుంచి ఐదు జిల్లాల్లోని ఐదు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించామ‌న్నారు. ఇక్క‌డ ఎదుర‌య్యే మంచి చెడుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేసి వ‌చ్చే నెల‌లో జిల్లాకు ఒక మండ‌లంలో ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ ఐదు మండ‌లాల్లో కూడా ప్రతి స‌ర్వే నెంబరుకు భూధార్ నెంబ‌ర్‌ను కేటాయిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపాల‌న్న సంక‌ల్పంతో ప్రభుత్వం ప‌ని చేస్తోంద‌ని మంత్రి (Ponguleti) తెలిపారు.

రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాల‌కు నక్షాలు లేవ‌ని మంత్రి అన్నారు. ఇందులో ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్ కేటాయించామ‌న్నారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవ‌ర్స్ వంటి ఆధునిక స‌ర్వే సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి రీసర్వే ప‌నులు కొనసాగిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాల‌ను గుర్తించి స‌ర్వే చేప‌ట్టబోతున్నామ‌న్నారు. స‌ర్వే అనంత‌రం హ‌ద్దుల‌ను గుర్తించి భూధార్ నెంబ‌ర్ ఇస్తామ‌ని, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ద‌శ‌ల వారీగా స‌ర్వే నిర్వహించాల‌ని నిర్ణయించామ‌ని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 ల‌క్షల స‌ర్వే నెంబ‌ర్లు వినియోగంలో ఉండ‌గా అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఈ 77 సంవ‌త్సరాల‌లో 2 కోట్ల 29 ల‌క్షల‌కు చేరుకున్నాయ‌ని తెలిపారు. వీట‌న్నింటికీ భూధార్ నెంబ‌ర్ ఇవ్వడానికి ప్రణాళిక‌లు త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు.

భూ స‌ర్వేకు అవ‌స‌ర‌మైన సిబ్బందిని స‌మ‌కూర్చుకోవ‌డం జ‌రిగింద‌ని, శిక్షణ ఇచ్చి 5,520 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లకు లైసెన్స్‌లు జారీ చేశామ‌ని చెప్పారు. భూ విస్తీర్ణాన్ని బ‌ట్టి ప్రతి మండ‌లానికి న‌లుగురి నుంచి ఆరుగురి వ‌ర‌కు సర్వేయ‌ర్లను నియ‌మించామ‌న్నారు. రాష్ట్రంలోని 10,984 రెవెన్యూ గ్రామాల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి జీపీవోల‌ను నియ‌మించిన‌ట్లు వివ‌రించారు. గొలుసులు, క‌ర్రలు, క్రాస్ స్టాఫ్‌, మెజ‌రింగ్ టేప్ వంటి పాత‌ స‌ర్వే ప‌రిక‌రాల‌కు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాల‌తో పాటు, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తున్న‌ట్లు చెప్పారు. ఇప్పటికే 411 రోవ‌ర్లను కొనుగోలు చేయ‌గా, త్వర‌లో మ‌రో 400 కొనుగోలు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు.

Read Also: వివాదాలైనా… విధానాలైనా ఈ మంత్రులకు సాటి లేరు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>