కలం, వెబ్ డెస్క్: సీబీఎస్ఈ (CBSE) మూల్యాంకన వివాదంలో చిక్కుకున్న కో ఎంప్ట్ సంస్థపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా చేసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న సంబంధంపై తీవ్ర విమర్శలు చేశారు. కో ఎంప్ట్ (COEMPT) సంస్థ గతంలో 2019లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ ఒక్కటేనని పొంగులేటి గుర్తు చేశారు. నాడు గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, సుమారు 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనను ఆయన ప్రస్తావించారు. అప్పట్లో కేటీఆర్ తన స్వలాభం కోసం ఆ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని, అదే అవినీతి మోడల్‌ను ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని పొంగులేటి ఆరోపించారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న సంస్థనే ఇప్పుడు జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాంకనానికి వినియోగించడం వెనుక బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం కనిపిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అనుసరించిన అవినీతి పద్ధతులే బీజేపీకి స్ఫూర్తినిచ్చాయని, అందుకే ఆ పార్టీని బీజేపీ రాష్ట్ర సమితి అని పిలవాలని ఆయన విమర్శించారు. ఒక రాష్ట్రంలో వైఫల్యం చెందిన సంస్థకు జాతీయ స్థాయి కాంట్రాక్టు దక్కడం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు.

