కలం, వెబ్ డెస్క్: నాదర్‌గుల్ భూములపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి (Ponguleti) ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలోనే ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని వివరించారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో 2014లోనే ఇక్కడ నిర్మాణాలు మొదలుపెట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ హరీశ్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్ రావును అబద్దాల రావు అంటూ పొంగులేటి అభివర్ణించారు. బుధవారం ఆయన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్, హరీశ్‌రావు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని పొంగులేటి స్పష్టం చేశారు.
దొరపాలనలోనే రిజిస్ట్రేషన్
అబద్ధాల రావు (హరీశ్ రావు), డ్రామారావు (కేటీఆర్), శుకుని మామ (కేసీఆర్) పదేండ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు. వారికి అంటిన బురదను కాంగ్రెస్ నేతలకు అంటించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఇప్పటికే అనేక తప్పుడు ఆరోపణలు చేశారని.. ఇప్పుడుమో తనకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ విషయంలోనూ తప్పుడు ప్రచారమే చేస్తున్నారని మండిపడ్డారు. నాదర్‌గుల్‌లోని 372 ఎకరాలకు (Nadergul Lands) సంబంధించి బీఆర్ఎస్ నేతలు, హరీశ్ రావు (Harish Rao) చెబుతున్నదంతా అబద్ధాలేనని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయని వివరించారు. ఈ భూములను ఓసారి ప్రభుత్వ భూములని.. మరోసారి ప్రైవేటు భూములని కోర్టు తీర్పు ఇచ్చిందని.. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై అబద్ధాల రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలోనే ఇక్కడ నిర్మాణాలు మొదలయ్యాయని గుర్తు చేశారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎవరిదో తెలియదా?
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుకు రాఘవ కన్ స్ట్రక్షన్ ఎవరిదో తెలియదా? అంటూ పొంగులేటి (Ponguleti) ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ సంస్థ మోచేతి నీళ్లు తాగిందని పేర్కొన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి కోటి రూపాయలు అధికారికంగా చెల్లించిందని గుర్తు చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఇంకా ఏమేం చేసిందో కేటీఆర్ అంతరాత్మకు బాగా తెలుసని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేయడం ఆపి నిజాలు మాట్లాడాలని సూచించారు. వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదని ఘాటుగా విమర్శించారు.
Read Also: తల్లి ఆరోగ్యం.. సమాజానికి పునాది: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Follow Us On: Facebook

