కలం, ఖమ్మం బ్యూరో: ప్రజల వద్దకే పాలన అందించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని, ఇక్కడ ప్రజలు ఇచ్చిన ప్రతి వినతికి న్యాయం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. శనివారం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్ లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోదులబండ క్లస్టర్‌లో 12 గ్రామాలు ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గత 2.4 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ పనితీరు వల్లే ప్రతి ఎన్నికల్లో ప్రజలు అధిక మెజారిటీతో గెలిపిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఇది 5వ ప్రజాదర్బార్ సమావేశమని, ప్రతి సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే అధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు.
ఎక్కువ దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్లులే..
గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకపోవడం వల్లే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing)కు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని పొంగులేటి అన్నారు. తమ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వడమే కాకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేయడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. మే నెలాఖరులో రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. మూడవ, నాలుగవ దశల్లో కూడా ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. భూమి సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంటూ, గత ప్రభుత్వ ధరణి విధానం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. రాబోయే 2 నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. భూ భారతి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని, ప్రభుత్వ భూములను సాదాబైనామా ద్వారా ఆక్రమించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తాం..
అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. ఈ రోజు ప్రతిష్ఠాత్మకంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, నేలకొండపల్లి మండలంలో ఇది రెండో క్లస్టర్ కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. అందిన ప్రతి వినతిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మంత్రి సూచనల మేరకు కొన్ని సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కొన్ని వినతులను 7 రోజుల్లో, మరికొన్నింటిని 3 నెలల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి వినతిని పారదర్శకంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందిరమ్మ గృహ లబ్ధిదారురాలు పి. శోభ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు ఇల్లు లభించిందని, తమకు స్వంత ఇల్లు ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. ఈ రోజు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తమకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

