కలం, వెబ్ డెస్క్: ముంబయికి చెందిన అజయ్ దొకాడియా, అతడి భార్య, ఇద్దరు పిల్లలు ఆకస్మిక మరణాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వారంతా రాత్రి నిద్ర పోయే ముందు పుచ్చకాయ (Watermelon) తినేసి పడుకున్నారు. కొద్దిసేపటికే, తీవ్ర అస్వస్థతకు గురి కాగా, నలుగురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే నలుగురు మరణించడంతో.. ఎలా చనిపోయారనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. పుచ్చకాయలో విషపూరిత రసాయనాలే కారణమా.. అనే చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అప్రమత్తమైంది.
పండ్ల సరఫరాలపై నిఘా అవసరం..
మార్కెట్లోకి వస్తున్న పుచ్చకాయల సరఫరాలపై నిఘా పెట్టాలని FSSAI ఆదేశించింది. ముంబయి ఘటన సహా దేశ వ్యాప్తంగా ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని ఫ్రూట్ మార్కెట్ల రిటైలర్లను కోరింది. అవసరమైతే.. కొన్ని శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయించడం మరీ ముఖ్యమని కూడా సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే క్రమంలో, ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఇవ్వొద్దని పేర్కొంది. కాగా, ముంబయి ఘటనలో ఇంకా పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే, పుచ్చకాయలో ఎలాంటి విషపు ఆనవాళ్లు లేవని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.

