కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా సంక్షేమ పథకాలను ఆపడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బుధవారం నేలకొండపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్, నాచేపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ బాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
మహిళలకు తోబుట్టువులా ఉంటా
తమ ప్రభుత్వం పేదలు, రైతుల పక్షపాత ప్రభుత్వంగా కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు అండదండలుగా, మహిళలకు తోబుట్టువులా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా పేదలకు ఇచ్చిన మాట నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని పొంగులేటి (Ponguleti Srinivas Reddy) వివరించారు. ఆనాటి పాలకులు ‘వరి వేస్తే ఉరి’ అన్నారని.. కానీ తమ ప్రభుత్వంలో వరికి బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఆంక్షలకు భిన్నంగా నేడు సన్న వడ్లకు మద్దతుధరతోపాటు 500 రూపాయలు క్వింటాల్‌కు బోనస్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనకంటే అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసి.. రైతులకు వెంటనే ఖాతాల్లో నిధులను జమ చేశామని చెప్పుకొచ్చారు.
6 నెలల్లోనే పూర్తి రుణమాఫీ
గత పాలకులు లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు ఐదేండ్ల సమయం తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కాలంలోనే 21 వేల కోట్ల రూపాయలు విడుదల చేసి 25 లక్షల మంది రైతన్నలకు రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద రూ. 10 వేలు అందిస్తే మనం రైతు భరోసా (Rythu Bharosa) కింద రూ. 12 వేలు ఇస్తున్నట్లు వివరించారు. గతంలో ఉన్న గోదాముల కంటే 200 శాతం అధికంగా నిర్మాణం చేసేందుకు కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు. ప్రైవేటు రంగానికి దీటుగా రైతన్నల కోసం ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తుందని త్వరలోనే రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతిపక్షం సామాజిక మాధ్యమాన్ని ఆయుధంగా మార్చి అబద్దాలను ప్రచారం చేసినప్పటికీ ప్రతి ఎన్నికలలో ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.
నాణ్యమైన ధాన్యమే తీసుకురండి: అదనపు కలెక్టర్
రైతులు నాణ్యమైన పంటను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని.. నాణ్యమైన పంటకు మాత్రమే మద్దతు ధర చెల్లిస్తామని అదనపు కలెక్టర్ పీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్లపై పంట వేసే సమయంలో తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు పెట్టాలని లేకపోతే రాత్రి సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్ మిల్లుకు పంట తరలిస్తున్నామన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
‘పొంగులేటి చొరవతోనే సమస్యలు పరిష్కారం’
రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన తర్వాత మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధించి అవసరమైన నిధులు ప్రభుత్వం చేత మంజూరు చేస్తున్నామన్నారు. ఇంటిపై నుంచి వెళ్లే కరెంటు వైర్ల తొలగింపు సమస్య దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్నప్పటికీ మంత్రి పొంగులేటి చూపించిన ప్రత్యేక చొరవ కారణంగా నేడు సమస్య పరిష్కారమైందన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఆర్డీఓ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీ సీతారాములు, సంబంధిత అధికారులు, సెంటర్ ఇన్‌చార్జ్ బీ అశోక్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం
Follow Us On: X(Twitter)

