కలం, వెబ్ డెస్క్: వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్ సైజ్‌లలో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విపత్తు ప్రత్యేక బృందాలు.. గాలితో నింపే లైఫ్ బోట్లు, నీటిలో చిక్కుకున్న వారిని రక్షించే అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, అత్యవసర తరలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్‌లను మంత్రి ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం నెక్లెస్ రోడ్ బోటింగ్ క్లబ్‌ను సందర్శించి అక్కడి రెస్క్యూ కార్యకలాపాలను పరిశీలించారు.
అనంతరం ICCCలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పొంగులేటి విపత్తు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ సూచనల మేరకు ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యాధునిక పరికరాలను పరిశీలించి, వాటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను, ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వేగవంతమైన స్పందన, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సహకారంతో నిర్వహిస్తున్న ఈ మాక్ డ్రిల్ ద్వారా లభించే అనుభవాలతో అధికారులు విపత్తుల సమయంలో మరింత బాధ్యతాయుతంగా సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట ఎంతో కీలకమైనదని, దానిని ‘గోల్డెన్ అవర్’గా పరిగణించాలి. ఆ సమయంలో సిబ్బంది అంతా పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు.

