కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా పోలీస్ శాఖ (Police Department)లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు డిపార్ట్‌మెంట్‌లోని అంతర్గత కుమ్ములాటలను రచ్చకెక్కించాయి. అయితే నల్లగొండ జిల్లా పోలీసు శాఖలోనే మిర్యాలగూడ డివిజన్ కీలకం. ఇటు మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటు అటు నాగార్జునసాగర్ నియోజకవర్గం ఈ డివిజన్ పరిధిలోనే వస్తాయి. అయితే ఈ రెండు నియోజకవర్గాలు పొరుగు రాష్ట్రమైన ఏపీకి ఆనుకుని ఉండడంతో ఇక్కడ నిత్యం పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇల్లీగల్ దందాలతో పాటు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి డివిజన్‌లో గత కొంతకాలంగా పోలీసు శాఖలో అలజడి నెలకొంది. ప్రధానంగా నాగార్జునసాగర్ పేకాట విషయంలో పోలీసు శాఖ కొంతమేర అప్రతిష్టను మూటగట్టుకుందనే చెప్పాలి. అందులో భాగంగానే మిర్యాలగూడ డీఎస్పీగా పనిచేస్తున్న రాజశేఖరరాజును ఇక్కడి నుంచి బదిలీ చేశారనే ప్రచారం లేకపోలేదు. అందులో వాస్తవం ఎంత ఉన్నప్పటికీ కొత్తగా నియామకమైన డీఎస్పీ తుమ్మ ఆనంద్ రెడ్డి దాదాపు 10 రోజులు పూర్తి అయినా నేటికీ మిర్యాలగూడ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో అసలు డీఎస్పీ ఆనంద్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారా..? ఇక్కడికి పోస్టింగ్ ఆయనకు ఇష్టమేనా..? లేక ఎవరైనా ఆనంద్ రెడ్డిని అడ్డుకుంటున్నారా..? అన్న ప్రశ్నలు లేకపోలేదు. ఈ క్రమంలోనే మిర్యాలగూడ డీఎస్పీ నియామకంపై కొత్త ప్రచారం షూరూ అయ్యింది.
ఆనంద్ రెడ్డిని అడ్డుకుంటుందెవరు..?
తుమ్మ ఆనంద్ రెడ్డికి మిర్యాలగూడ డివిజన్‌తో ఉన్న అనుబంధం కేవలం వృత్తిపరమైనదే కాదు.. అది దశాబ్దాల జ్ఞాపకం. కెరీర్ ఆరంభంలో హాలియాలో ఎస్ఐగా పని చేసిన ఆయన, ఆ తర్వాతి కాలంలో అదే హాలియాతో పాటు మిర్యాలగూడలోనూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు డీఎస్పీ హోదాలో అదే ప్రాంతానికి తిరిగి రావడం గమనార్హం. మిర్యాలగూడ డివిజన్‌లో ఉన్న భౌగోళిక పరిస్థితులు, రాజకీయ సమీకరణలు, స్థానిక నేరాల తీరుపై ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. దీనికితోడు గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన సమయంలో ప్రజలతోనూ, కింది స్థాయి సిబ్బందితోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది సమాచార సేకరణలోనూ, నేర నియంత్రణలోనూ పోలీసులకు అదనపు బలాన్ని ఇస్తుంది. అయితే ఇది కొంతమంది రాజకీయ లీడర్లతో పాటు పోలీసు అధికారులకు ఇష్టం లేనట్టు సమాచారం. అందులో భాగంగానే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి డీఎస్పీ తుమ్మ ఆనంద్ రెడ్డిని అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు ఇతర అంశాల్లోనూ డీఎస్పీ ఆనంద్ రెడ్డి సమస్య వస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆనంద్ రెడ్డి జాయిన్ కావడం లేదని సమాచారం. జాయిన్ అయ్యేందుకు మూడు నాలుగు రోజులు పడుతుందని చెబుతున్నప్పటికీ అసలు జాయిన్ అవుతారా..? లేక వేరే పోస్టింగ్ తీసుకుంటారా..? అన్న ప్రచారం ఉంది.
విజయ విహార్ కేసుతో అలజడి..
గతేడాది నవంబర్‌లో నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ హోటల్‌లో పేకాట ముఠా తప్పించుకున్న ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. అప్పట్లో పోలీసులు దాడి చేసే ముందే సమాచారం లీక్ కావడంతో ముఠా పరారైంది. ఈ కేసులో నందికొండ పోలీసుల వైఫల్యంపై నిఘా పెట్టిన జిల్లా ఎస్పీ, విచారణ బాధ్యతను డీఎస్పీ రాజశేఖర రాజుకు అప్పగించారు. డీఎస్పీ తనదైన శైలిలో కూపీ లాగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కదలికలను పేకాట ముఠాకు చేరవేస్తున్నది నందికొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఒక హోంగార్డు అని తేలింది. ఇతని సమాచారంతోనే ముఠా తప్పించుకోగలిగింది. పేకాట సూత్రధారి గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన విజయ్ అని గుర్తించిన డీఎస్పీ బృందం.. అతన్ని ఆంధ్రా సరిహద్దుల్లో చాకచక్యంగా అరెస్ట్ చేసింది. నిజాయితీగా కేసు విచారణ జరిపి అసలు దోషులను పట్టుకున్నందుకు అభినందించాల్సింది పోయి, డిపార్ట్‌మెంట్‌లోని కొందరు అధికారులు, రాజకీయ నేతలు రాజశేఖర రాజుపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు లేకపోలేదు.
సాగర్ తీరంలో సాగుతున్న అక్రమ దందా..
నాగార్జునసాగర్ నియోజకవర్గం ఆంధ్రా సరిహద్దులో ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. కేవలం పేకాట మాత్రమే కాదు.. ఇసుక అక్రమ రవాణా, వైన్స్ గొడవలు, వేశ్యా గృహాల నిర్వహణ వంటి అంశాల్లో రాజకీయ నేతలు, కొందరు పోలీసులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఓ కీలక ప్రజాప్రతినిధి అనుచరుడు పేకాట వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని తెలుస్తోంది. పేకాట ఆడేందుకు ఎలాంటి డిస్ట్రబ్ లేకుండా ఉండేందుకు పోలీసు శాఖనే తన గ్రిప్‌లో పెట్టుకున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇటీవలి పేకాట కేసులో నందికొండకు చెందిన కొంతమంది తాజా, మాజీ కౌన్సిలర్ల అనుచరుల పేర్లు బయటకు రావడం రాజకీయంగా కలకలం రేపింది. ప్రధానంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుపుతున్న వర్గాల అనుచరులు పోలీసు శాఖ ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

