కలం, జోగులాంబ గద్వాల : మహారాష్ట్ర, కర్ణాటక లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కర్ణాటక జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టులోకి (Jurala Project) భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం మద్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్టుకు 171000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది.
దీంతో ప్రాజెక్టుకు వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు 29 క్రస్టు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 1,46,018 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 33,966 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తికి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతోపాటు నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-1కు 1,300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు మొత్తం ఇన్‌ఫ్లో శనివారం సాయత్రం 6గంటలకు జూరాల ఇన్ ప్లో 1,70,000 క్యూసెక్కులు, కాగా అవుట్ ఫ్లో 1,79,023 క్యూసెక్కులుగా నమోదైంది.

