కలం, కరీంనగర్ బ్యూరో: పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Elections) గెలిచిన సర్పంచులను కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలు నానా కష్టాలు పడుతున్నాయి. ఎలాంటి పార్టీ గుర్తు లేకుండా సర్పంచులు గెలిచినా.. తాము బలపరిచిన అభ్యర్ధి అంటూ పార్టీలు ప్రకటించుకుంటున్నాయి. రాష్ట్రంలో మూడు విడతల్లో 7వేలకు పైగా పంచాయతీలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులు గెలిస్తే.. బీఆర్ఎస్ 3500 లోపు పంచాయతీలను దక్కించుకుంది. 600లకు పైగా స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. వెయ్యికి పైగా స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. స్వతంత్రులుగా గెలిచిన వారిలో మోజార్టీ సభ్యులు కాంగ్రెస్ నుంచి రెబల్ గా పోటీ చేసిన వారే కావడం అంటున్నారు ఆ పార్టీ నేతలు.
అధికార పార్టీ వైపు మొగ్గు..
ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) గెలుపొందిన స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్ధులు అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో మరో మూడేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. ఆ పార్టీలోకి వెళ్తే ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో గ్రామాలకు ప్రత్యేక నిధులు సాధించుకోవచ్చనే ఆలోచనలో సర్పంచులు ఉన్నట్లు సమాచారం. అయితే తాము బలపరిచిన సర్పంచులు దూరం కాకుండా బీఆర్ఎస్, బీజేపీలు వివిధ రకాల హమీలు ఇస్తున్నాయి. బీఆర్ఎస్ సర్పంచులకు అండగా నిలుస్తామని కేటీఆర్ ప్రకటించగా.. బీజేపీలో చేరితే పెద్ద ఎత్తున ఆ గ్రామాలను అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో వచ్చే ఎన్నికల వరకు సర్పంచులను కాపాడుకొని గ్రామాలపై పట్టు సాధించాలని పార్టీలు భావిస్తున్నాయి.


