కలం, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాలను మలుపుతిప్పే బిల్లులు.. మారిన రాజకీయ సమీకరణాలు.. తిరుగుబాటు ఎంపీలతో మారిన సంఖ్యాబలం.. ఇలాంటి కీలక పరిణామాల మధ్య సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ప్రారంభం కానున్నాయి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి రాజ్యాంగ సవరణ బిల్లులను ఈసారి ఎలాగైనా ఆమోదింపచేసుకోవాలని ఎన్డీయే కసరత్తు చేస్తుండగా.. వాటిని అడ్డుకోవడానికి ఇండియా శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు అధికార ఎన్డీయే బలం పెరిగినా.. రెండొంతుల మెజారిటీ ఇంకా సవాలుగానే కనిపిస్తున్నది.
ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సాధారణ బిల్లులతో పాటు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాలపైనే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు, దానికి అనుసంధానంగా డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలపై చర్చ జరుగుతున్నది. గత సమావేశాల్లో ఈ బిల్లులు అవసరమైన రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఆమోదం పొందలేదు.
సంఖ్యాబలమే అసలు పరీక్ష
రాజ్యాంగ సవరణ బిల్లులకు సాధారణ మెజారిటీ సరిపోదు. లోక్‌సభలో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. అందుకే అధికార, ప్రతిపక్ష కూటముల రెండింటికీ సంఖ్యాబలం అత్యంత కీలకంగా మారింది. గత సమావేశాలతో పోలిస్తే ఈసారి అధికార ఎన్డీయేకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలను స్పీకర్ అధికారికంగా ఏక్‌నాథ్ షిండే శివసేనలో విలీనం చేసినట్లు గుర్తించారు.
దీంతో ఎన్డీయే బలం పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు చేసిన 20 మంది ఎంపీలకు లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ వర్గం ఎన్డీయేకు మద్దతు ప్రకటించింది. అయితే వీరి విలీనంపై తుది నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పరిణామాలతో అధికార కూటమి సంఖ్యాబలం పెరిగినా, రాజ్యాంగ సవరణకు కావాల్సిన సంఖ్య మాత్రం ఇంకా పూర్తిగా చేరలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రాంతీయ పార్టీలపైనే దృష్టి
డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్), మరికొన్ని ప్రాంతీయ పార్టీల వైఖరి ఈసారి కీలకంగా మారింది. డీఎంకే ఇప్పటికే తమిళనాడుకు నష్టం జరగదనే స్పష్టమైన హామీ ఇస్తే డీలిమిటేషన్‌పై చర్చకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. ఇదే ఎన్డీయేకు ఆశలు పెంచుతున్నది.
ఇండియా కూటమి వ్యూహం
మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని, అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తాలని ఇండియా కూటమి భావిస్తున్నది. ఎన్డీయేకు రెండొంతుల మెజారిటీ రాకుండా తమ సంఖ్యాబలాన్ని కాపాడుకోవడమే ప్రతిపక్ష వ్యూహంగా కనిపిస్తున్నది. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే అమల్లో ఉన్న ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష ఖరారైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారు. అదే సూత్రం ప్రకారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి పదవిలో ఉన్నవారు కూడా శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోతే ఆ పదవిలో కొనసాగలేరు. అయితే దీనిపై కొత్త బిల్లు అధికారిక అజెండాలో ప్రస్తుతం లేదు.
ఎవరి వ్యూహం ఫలిస్తుంది?
గత సమావేశాల్లో సంఖ్యాబలం లేక నిలిచిపోయిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో ఎన్డీయే ఉంది. అయితే కేవలం మిత్రపక్షాల బలంతోనే కాకుండా కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు లేదా కనీసం వారి గైర్హాజరు కూడా అధికార కూటమికి అవసరం. అందుకే ఈ సమావేశాల్లో సంఖ్యా రాజకీయాలే ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి.
ఎవరి బలమెంత?
ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయేకు సుమారు 299 మంది సభ్యుల బలం ఉంది. శివసేన (యూబీటీ) నుంచి విలీనమైన ఆరుగురు ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు కీలక బిల్లులపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే ఎన్డీయే బలం 319కు చేరే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలతో కూడిన ఇండియా కూటమికి సుమారు 209 మంది సభ్యుల బలం ఉంది.
ఇదిలా ఉండగా డీఎంకే ఇప్పటికే లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్ కోరుతూ ఇండియా కూటమికి దూరంగా ఉండే సంకేతాలు ఇచ్చింది. కీలక రాజ్యాంగ సవరణ బిల్లుల సందర్భంగా డీఎంకే (22), ఎన్సీపీ (శరద్ పవార్) (8), వైఎస్సార్‌సీపీ (4)తో పాటు ఇతర చిన్న పార్టీలు లేదా స్వతంత్ర ఎంపీలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఎన్డీయే సంఖ్యాబలం 380 దాటే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

